వైసిపిలోకి దర్శకరత్న దాసరి తనయుడు: క్లియర్ చేసిన జగన్

By Nagaraju penumalaFirst Published Feb 16, 2019, 4:40 PM IST
Highlights

వైఎస్ జగన్ లండన్ పర్యటన అనంతరం అరుణ్ కుమార్ వైఎస్ జగన్ ని కలిసి పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సీనీనటుడు పృథ్వీరాజ్ తో  కలిసి పర్యటిస్తారని సమాచారం. 

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ యావత్ గురువుగారు అని పిలుచుకునే వ్యక్తి ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దివంగత దాసరి నారాయణ రావు. ఆయన తనయుడు సినీనటుడు దాసరి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. 

ప్రముఖ దర్శకుడిగా, నిర్మాతగా దాసరి నారాయణ రావు ఓ వెలుగు వెలుగుతూ ఆ వెలుగు కింద ఎందరికో దారి చూపారు. కానీ సినీ ఇండస్ట్రీలో దాసరి అరుణ్ కుమార్ నిలదొక్కుకోలేకపోయారు. దాంతో వ్యాపార రంగంపై దృష్టి మళ్లించారు. 

దాసరి నారాయణ రావు మరణానంతరం ఆయన కుటుంబం నుంచి ఎవరూ బయటకు రాలేదు. దాసరి అరుణ్ కుమార్ అప్పుడప్పుడు అలా కనిపించేవారు తప్ప. అయితే ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. 

వైఎస్ జగన్ లండన్ పర్యటన అనంతరం అరుణ్ కుమార్ వైఎస్ జగన్ ని కలిసి పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సీనీనటుడు పృథ్వీరాజ్ తో  కలిసి పర్యటిస్తారని సమాచారం. 

దాసరి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సినీనటుడు పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఇకపోతే దాసరి నారాయణ రావు కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాసరి నారాయణ రావు కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. 

అలాగే వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దాసరి నారాయణ రావుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ జగన్ సైతం దాసరి నారాయణరావుతో సన్నిహితంగా ఉండేవారు. 2016 జనవరి 6న దాసరి నారాయణ రావును వైఎస్ జగన్ కలిశారు. తనను ఆశీర్వదించాల్సిందిగా వేడుకున్నారు. 

ఈ సందర్భంగా దాసరి నారాయణ రావు జగన్ పై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ మంచి నాయకుడుగా గుర్తుంపు తెచ్చుకున్నారని అతనికి మంచి భవిష్యత్ ఉందని దాసరి చెప్పారు. ప్రజల కోసం జగన్ పోరాటం చేస్తున్నారని అతనికి నా ఆశీస్సులు ఉంటాయని హామీ ఇచ్చారు. 

ఆ తర్వాత కొద్ది రోజులకే దాసరి నారాయణ రావు అనారోగ్యం పాలయ్యారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న దాసరి నారాయణ రావును వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పటి నుంచి ఈ కుటుంబాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. 

ఇకపోతే దాసరి నారాయణరావు తెలుగు సినీ ఇండస్ట్రీలో 150కి పైగా సినిమాలకు దర్శకత్వం 53 సినిమాలకు నిర్మాత 250కి పైగా సినిమాలకు మాటల రచయితగా ఇలా సినీ రంగంలో ఆయనకంటూ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. పలు సినిమాల్లో నటుడిగా తన ప్రత్యేకతను కూడా చాటుకున్నారు. 

అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కూడా సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఏకైక వ్యక్తిగా దాసరి నారాయణ రావుకు మంచి పేరు ఉంది. అందుకే అంతా ఆయనను గురువుగారు అని పిలుస్తుంటారు. 

అటు టాలీవుడ్ లో ఎందరికో లైఫ్ ఇచ్చిన వ్యక్తిగా కూడా దాసరిని చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయాల్లోనూ దాసరి నారాయణ రావు కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా గుర్తింపు పొందారు. అలాగే కాపు సామాజిక వర్గం నేతలకు పెద్ద దిక్కుగా దాసరి నారాయణ రావు వ్యవహరిస్తూ ఉండేవారు. 

ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం ఉద్యమానికి దాసరి నారాయణ రావు సూచనలు సలహాలు తీసుకునేవారు. ఉభయగోదావరి జిల్లాలో దాసరి నారాయణ రావుకు పట్టు ఉందని ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని తెలుస్తోంది. 

ఇప్పుడు దాసరి అరుణ్ కుమార్ ను ఎన్నికల ప్రచారంలో దించితే ఆ సానుభూతితోపాటు దాసరి నారాయణరావుపై ఉన్న అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

click me!