ఏపీలో అన్నదాతలను నిండా ముంచిన మాండూస్ తుఫాన్.. పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు..

By Sumanth KanukulaFirst Published Dec 12, 2022, 11:24 AM IST
Highlights

మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదు కాగా.. మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు వరి పంట, బొప్పాయి, అరటి చెట్లు నెలకొరిగాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాలోని కొన్నిచోట్ల ఇటీవల వేసిన వరి నాట్లు కూడా నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో కోసి ఆరబెట్టిన వరి కూడా తడిసింది. అయితే ధాన్యం సేకరణలో జాప్యమే ఇందుకు కారణమని  రైతులు ఆరోపిస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెన్నా నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో సంగం బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు స్వర్ణముఖి, కాలంగి, కౌవల్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

ఇక, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరులో  గత రాత్రి నుంచి మరోసారి వర్షం కురుస్తోంది. జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతి జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో టీటీడీ కనుమ రహదారుల్లో ముందు  జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

మరోవైపు మాండూస్ తుఫాన్ ప్రభావంతో బలమైన అలల కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్ రోడ్డు దెబ్బతింది. ఆదివారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి రవీంద్రనాథ్ రోడ్డును పరిశీలించి.. తుపాను ఇంకా తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. కాకినాడ నుంచి ఉప్పాడకు వెళ్లే బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే వాహనాలను అచ్చంపేట వైపు, ఉప్పాడ నుంచి కాకినాడ వైపు వెళ్లే వాహనాలను పిఠాపురం మీదుగా మళ్లించామని ఎస్పీ తెలిపారు

click me!