టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Raidu) వచ్చే ఎన్నికల నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎం జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Raidu) ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తరుచుగా ఏపీ రాజకీయాలపై తనదైన తీరులో స్పందిస్తున్నారు. దీంతో ఆయన త్వరలోనే రాజకీయాల్లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆయన ఏ పార్టీలో చేరుతారని ఆసక్తి నెలకొంది. అయితే.. మాజీ టిమిండియా ప్లేయర్ మాత్రం ఆచూతూచీ అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్‌తో గతంలోనే భేటీ అయ్యారనీ, ఆయన వైసీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో అంబటి రాయుడు శనివారం నాడు తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలో పర్యటించారు. ఈ క్రమంలో రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని, కార్పొరేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోవని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నన్ని సదుపాయాలు దేశంలో మరెక్కడా లేవన్నారు.
అంతేకాక ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారనీ, విద్యారంగంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు. అలాగే.. మధ్యాహ్నం భోజన పథకం ద్వారా పిల్లలకు రుచికరమైన ఆహారం ఇస్తున్నారని, విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని తనకు నమ్మకం ఉందని తెలిపారు. అలాగే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని, వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ కు ధీటైన రాష్ట్రం మరొకటి లేదని తెలిపారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష' పేరిట ఎంతో మందికి వైద్య సేవలందించారని, ఇది గొప్ప కార్యక్రమమని కొనియాడారు. అలాగే.. రైతులను కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని , రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.