నోట్ల రద్దు సమయంలో బీజేపీ ఖాతాలో రెండున్నరలక్షల కోట్లు: సీపీఐ నారాయణ సంచలనం

By narsimha lode  |  First Published Jul 9, 2021, 9:40 AM IST

విశాఖస్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు ప్రకటించారు. నోట్ల రద్దు సమయంంలో బీజేపీ ఖాతాలో రెండున్నర లక్షలకోట్లు జమ అయ్యాయని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిలిపివేయాలని  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రాన్ని కోరితే ప్రైవేటీకరణ వెంటనే నిలిచిపోయే అవకాశం ఉందన్నారు.



విశాఖపట్టణం: దేశంలో పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన సమయంలో రెండున్నర లక్షల కోట్లు బీజేపీ ఖాతాలో జమ అయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కార్మికుల దీక్షలు శుక్రవారం నాటికి 148వ రోజుకు చేరుకొన్నాయి. ఈ దీక్షలకు నారాయణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు సమయంలో 20 లక్షల కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని ఆయన ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ప్రకటించారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ మిజోరాం గవర్నర్ గా  బాధ్యతలు చేపట్టవద్దని ఆయన కోరారు. ఈ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దని ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు ఒక్కమాట చెబితే ప్రైవేటీకరణ నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos

స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ విషయంలో  బీజేపీ, వైసీపీ రెండు దోషులేనని ఆయన చెప్పారు. దేశంలోని సంపద అంతా అంబానీ, ఆదానీ చేతుల్లోకి పోతోందన్నారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన 20 మందికి పైగా మంత్రులు  జైలు శిక్షను అనుభవించారని ఆయన గుర్తు చేశారు.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత  బ్యాంకులను మోసం చేసిన వారంతా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని వచ్చినా లేకున్నా కూడ విశాఖ పట్టణం అభివృద్ది చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

click me!