కరోనా భయం... అంత్యక్రియలను కూడా అడ్డుకున్న గ్రామస్తులు

By Arun Kumar PFirst Published Apr 23, 2020, 12:15 PM IST
Highlights

కరోనా భయంలో  సొంత గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కూడా ఖననం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న ఘటన మోపిదేవి మండల పరిధిలోని మోపిదేవి లంక గ్రామంలో చోటుచేసుకుంది.  

విజయవాడ: అవనిగడ్డ సమీపంలోని మోపిదేవి మండలం పరిధిలోని మోపిదేవి లంక గ్రామంలో ఓ మృతదేహం కలకలం రేపింది. విజయవాడ లో అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని అర్ధరాత్రి ప్రైవేటు అంబులెన్స్ లో తీసుకుని వచ్చి రోడ్డుపై వదిలేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడో చనిపోయిన వ్యక్తిని మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకుని రావడంతో గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 

వివరాలలోకి వెళ్తే.. మోపిదేవి లంక గ్రామానికి చెందిన కారుమూరి వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా పెదపులిపాకలో భార్య, కుమారుడితో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో విజయవాడ ఆసుపత్రిలో మందులు వాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. అతడి భార్య, కుమారుడు ఓ ప్రైవేటు అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోపిదేవి లంక గ్రామానికి వచ్చారు. మృతదేహాన్ని రోడ్డుపై దింపారు. 

ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న మృతుని సోదరుడు మృతదేహాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నిరాకరించారు. ఎక్కడో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి తమ గ్రామానికి ఎందుకు తీసుకుని వచ్చారు అని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. 

మృతుని బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలా లేక విజయవాడ కు మృతదేహాన్ని తిరిగి పంపించాలా అన్నది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. వైద్యసిబ్బంది, ఉన్నతాధికారులు సలహా మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. 


 

click me!