జగన్ ఢిల్లీ టూర్ పై మంత్రి అనిల్: చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Oct 21, 2019, 11:34 AM IST
Highlights

చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు కానీ జగన్ వెళ్తే తప్పా..? అని టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేసేందుకు ఢిల్లీ వెళ్తే తమ సీఎం రాష్ట్రప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే తప్పేంటని నిలదీశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ చేస్తున్న ప్రచారానికి  సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  

చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు కానీ జగన్ వెళ్తే తప్పా..? అని టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేసేందుకు ఢిల్లీ వెళ్తే తమ సీఎం రాష్ట్రప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
తమ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పోలవరం టెండర్లలో ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టి మాజీ సీఎం చంద్రబాబు తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని విమర్శించారు.

వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో రూ. 61 కోట్లు మేర ప్రభుత్వానికి ఆదా అయ్యిందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమలులోకి తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.1000 కోట్లు సేవ్ అయ్యిందన్నారు.  

రాబోయే రోజుల్లో చేపట్టబోయే రివర్స్ టెండరింగ్‌లో మరొక 500 కోట్లు మిగులుతాయనడంలో ఎలాంటి సందేహమే లేదన్నారు. తాము రివర్స్ టెండరింగ్ నిర్వహించకపోతే రూ.1500 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళేవో ప్రజలు గుర్తించాలని కోరారు. 

చంద్రబాబు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే వేల కోట్లు మిగిలేవన్నారు. నిర్దేశించిన దానికంటే అత్యధికంగా టెండర్లు నిర్వహించడం ద్వారా చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 

రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల ప్రజా ధనం మిగిలితే అభినందించాల్సిన ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ వల్ల అన్ని డిపార్ట్మెంటల్లో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉందదన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  

రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు. రేట్లు పెంచి పనులు కాంట్రాక్టర్లుకు ఇవ్వడం మంచిదా..? లేదంటే రేట్లు తగ్గించి పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వడం మంచిదా అని ప్రశ్నించారు.  

దేవుడు దయతల్చడంతో తమ పాలనలో మంచి వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండికోవడంతో జలకళ సంతరించుకుందన్నారు. చంద్రబాబు ప్రజాధనాన్ని పదిమంది కాంట్రాక్టర్లుకు కట్టబెట్టాలని చూస్తే అదే ధనాన్ని పేదలకు ఖర్చు చేయాలని జగన్ చూస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే చంద్రబాబు నాయుడు బీజేపీపై చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. టీడీపీతో విబేధించి నష్టపోయామని ఇప్పుడు చంద్రబాబు చెప్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి బట్టబయలు అవుతుందనే భయంతో ఇలాంటి కామెంట్స్ చేసి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 
 
 

click me!