చిత్తూరులో తోడికోడళ్ల మధ్య గొడవ: పరస్పరం దాడికి దిగిన రెండు గ్రామాల ప్రజలు

By narsimha lodeFirst Published May 25, 2020, 10:21 AM IST
Highlights

తోడి కోడళ్ల మధ్య ఘర్షణ రెండు గ్రామాల మధ్య చిచ్చును రేపింది. సినీఫక్కీలో మాదిరిగా రెండు గ్రామాల ప్రజలు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడులతో గ్రామంలోని మహిళలు భయానికి గురై తలుపులు వేసుకొని కూర్చొన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.


చిత్తూరు:   తోడి కోడళ్ల మధ్య ఘర్షణ రెండు గ్రామాల మధ్య చిచ్చును రేపింది. సినీఫక్కీలో మాదిరిగా రెండు గ్రామాల ప్రజలు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడులతో గ్రామంలోని మహిళలు భయానికి గురై తలుపులు వేసుకొని కూర్చొన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

చిత్తూరు జిల్లాలోని కేవీపల్లి మండలంలోని నక్కలదిన్నెవడ్డిపల్లెలోని ఇద్దరు తోడి కోడళ్ల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారి రెండు గ్రామాల ప్రజలు ఘర్షణకు దిగారు. వాహనాలు ధ్వంసం చేసుకొన్నారు.

నక్కలదిన్నెవడ్డిపల్లెకు చెందిన ఎ. అంజి భార్య నిర్మల అతని సోదరుడి భార్య చామంతి శనివారం నాడు తాగునీటి విషయంలో గొడవపడ్డారు. 

ఈ విషయం తెలుసుకొన్న దిన్నెవడ్డిపల్లెకు చెందిన నిర్మల బంధువులు నక్కలదిన్నెవడ్డిపల్లెకు చేరుకొని చామంతి కుటుంబంతో గొడవకు దిగారు. ఈ గొడవ మరింత పెద్దదిగా మారింది. ఆదివారం నాడు తెల్లవారుజామున రెండు గ్రామాల ప్రజలు పరస్పరం దాడులకు దిగారు.

రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో రెండు కార్లు, ఒక బైక్ ధ్వంసమైంది. ఈ దాడులతో మహిళలు తలుపులు వేసుకొని భయంతో గడిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.

 మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నక్కలదిన్నెవడ్డిపల్లెకు చేరుకుని సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 31 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!