
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని సీఐటీయూ నేతలు అడ్డుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికి పక్కకు తప్పించారు. వివరాలు.. మిథున్ రెడ్డి నేడు మదనపల్లిలో నిర్వహించే అమ్మఒడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే స్థానిక ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వద్ద సీఐటీయూ నేతలు ధర్నా చేస్తున్నారు. గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు.
అయితే అదే సమయంలో మదనపల్లి వెళ్తున్న మిథున్ రెడ్డి కాన్వాయ్ ఎదుట సీఐటీయూ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ ముందుకు సాగింది.