తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (chopper crash) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు (Chittoor district) చెందిన లాన్స్‌నాయక్ బి సాయితేజ (Lance Naik Sai Teja) మృతిచెందారు. వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ తల్లి, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు (Chittoor district) చెందిన లాన్స్‌నాయక్ బి సాయితేజ (Lance Naik Sai Teja) మృతిచెందారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు సాయితేజ పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా ఉన్నారు. ఈ ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో సహా మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక, సాయి తేజ మృతిచెందారనే వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ తల్లిదండ్రులు, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు, స్నేహితులు సాయితేజతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే సాయితేజ సోదరుడు కూడా సైన్యంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు సాయితేజ, మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరారు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. ఏడు నెలల క్రితమే జనరల్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO to the CDS) నియమితులయ్యారు. సాయితేజ సోదరుడు మహేష్‌బాబు కూడా సైన్యంలోనే ఉన్నారు.
undefined
బుధవారం ఉదయం భార్య, పిల్లలతో మాట్లాడిన సాయితేజ..
సాయితేజకు భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (5), దర్శిని (2) ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితమే సాయితేజ.. తన కొడుకు మోక్షజ్ఞ ప్రాథమిక విద్య కోసం గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి తన భార్యాపిల్లలను మార్చారు. చివరి సారిగా వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. జనవరిలో సంక్రాంతి పండగకు వస్తానని కుటుంబ సభ్యులతో తెలిపారు. సాయితేజ రోజు భార్య, పిల్లలతో ఫోన్‌లో మాట్లాడేవారు. బుధవారం కూడా సాయితేజ.. భార్యకు వీడియో కాల్ చేశారు.
తన కుమార్తెను చూడాలనుకుంటున్నానని భార్యతో చెప్పారు. అయితే తమిళనాడుకు వెళ్లాల్సిన పని ఉండటంతో సాయి తేజ.. భార్యతో కొద్దిసేపు మాత్రమే మాట్లాడారు. సాయంత్రం ఫోన్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత బిపిన్ రావత్ వెళ్తున్న చాపర్ ప్రమాదానికి గురైదంని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. సాయితేజకు ఫోన్ చేశారు. అయితే ఎలాంటి స్పందన లేకపోవడం కంగారు చెందారు.
“తేజ కూడా అదే చాపర్‌లో ఉన్నాడా లేదా అనేది మాకు ఖచ్చితంగా తెలియదు. అతను క్షేమంగా ఉండాలని మేము ప్రార్థించాము. రాత్రి 8 గంటల సమయంలో న్యూ ఢిల్లీ నుండి అతని కమాండింగ్ ఆఫీసర్ శ్యామల సోదరుడికి ఫోన్ చేసి విషాద వార్తను తెలియజేశారు’’ సాయితేజ బంధువులు తెలిపారు. ఈ వార్తవిని సాయితేజ తల్లి, భార్య కన్నీటిపర్యంతం అయ్యారు.
బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సాయితేజ ఇంటికి చేరుకుని సాయితేజ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే చిన్నారులైన పిల్లలు ఇంత మంది తమ ఇంటికి ఎందుకు వస్తున్నారు, తల్లి ఎందుకు కన్నీరు పెట్టుకుంటుందో తెలియక అలా చూస్తుండిపోయారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు..
సాయితేజ అంత్యక్రియలను స్వగ్రామంలో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా సాయి తేజ కుటుంబాన్ని పరామర్శించారు. సైనిక గౌరవంతో సాయితేజ అంత్యక్రియలు జరగనుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సాయితేజ భౌతికకాయం ఎప్పటికీ స్వగ్రామానికి చేరుకుంటుందనే దానిపై స్పష్టత లేదని బంధువులు చెప్పారు.ఈ ఘటనపై సమాచారం ఇచ్చిన తర్వాత న్యూఢిల్లీ నుంచి ఎవరూ కుటుంబ సభ్యులతో మాట్లాడలేదని అన్నారు. భౌతికకాయం రాకపై స్థానిక అధికారుల వద్ద కూడా కచ్చితమైన సమాచారం లేదని చెప్పారు.
చిత్తూరు ఎస్పీ ఎస్ సెంథిల్ కుమార్ స్పందిస్తూ.. న్యూఢిల్లీలో లాన్స్‌నాయక్ సాయితేజ భౌతికకాయానికి లాంఛనంగా నివాళులర్పించిన తర్వాత శుక్రవారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా చెప్పారు. సాయితేజ అంత్యక్రియలకు (Lance Naik Sai Teja Funeral) ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు.