
కృష్ణా జిల్లా (krishna district) కంచికచర్ల (kanchikacherla) మండలం కీసరలో (keesara) సుబాబుల్ తోటల్లో బాలిక మృతదేహం లభ్యమైన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే నిందితుడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేశారు . నిందితుడు సొంత బాబాయేనని తేల్చారు. అతను తన రిక్షా బండిపై కీసర నుంచి సుబాబుల్ తోటలోకి బాలికను తీసుకెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజ్‌లో నమోదైంది.
కీసర గ్రామంలోకి ఎక్కడో నుంచి వచ్చి చిన్న డేరా వేసుకొని జీవిస్తోంది బాధితురాలి కుటుంబం. ఈ చిన్నారి రోడ్డు మీద అడుక్కొని పొట్ట నింపుకొని మిగిలినవి కుటుంబానికి ఇస్తూ ఆసరాగా వుంటోంది. అలాగే తల్లిదండ్రులు దారి వెంబడి ఉన్న చెత్త కాగితాలు వ్యర్ధ పదార్ధాలు, ప్లాస్టిక్ అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలోకి బంధువు రూపంలో ప్రవేశించాడు బాబాయ్. అతను బజారు దాకా వెళదాము అనటంతో సొంత బాబాయ్ కదా అని చిన్నారి నమ్మి వెళ్లి, కానరాని లోకాలకు తరలిపోయింది.
అంతకుముందు బుధవారం ఉదయం కీసర గ్రామ పరిధిలోని ఇన్వెంటా కర్మాగారం సమీపంలో ఓ బాలిక మృతదేహం పడివున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ నాగేంద్రకుమార్, ఎస్ఐ లక్ష్మి ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ప్రాథమిక ఆదారాలను సేకరించారు. ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేకుండా అర్ధనగ్న స్థితిలో పడివున్న బాలిక వయస్సు దాదాపు 10 నుండి 11 ఏళ్ల మధ్య వుంటుందని భావిస్తున్నారు. అలాగే బాలిక మృతదేహంపై గాయాలుండటంతో ఆమెపై అత్యాచారమేమైనా జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తేలనుంది.