కుర్చీకా కిస్సా: ఏపీ టీడీపీలో మెుదలైన ఇంటిపోరు

By Nagaraju TFirst Published Nov 23, 2018, 6:36 PM IST
Highlights

రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చంద్రబాబు నాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ తో పొత్తుకు కూడా జై కొట్టారు. అయితే కాంగ్రెస్ తో దోస్తీ కట్టినా... పాత సమస్యలు సద్దుమణగకపోగా... కొత్తగా మరిన్ని తలనొప్పులు మొదలయ్యాయి.

అనంతపురం: రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చంద్రబాబు నాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ తో పొత్తుకు కూడా జై కొట్టారు. అయితే కాంగ్రెస్ తో దోస్తీ కట్టినా... పాత సమస్యలు సద్దుమణగకపోగా... కొత్తగా మరిన్ని తలనొప్పులు మొదలయ్యాయి.

ఇతర సమస్యలను ఈజీగా సాల్వ్ చేసే చంద్రబాబుకు ఇంటి పోరు చక్కదిద్దడం పెద్ద సమస్యగా మారిందట. తెలంగాణలో పార్టీలో నెలకొన్న కుంపటి ఓదారికి వచ్చేసింది. రెబల్స్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓ రూట్ కి వచ్చేసిందన్నమాట. 

ఇకపోతే చంద్రబాబుకు అసలు సమస్య ఏపీలోనే ఉందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నా అప్పుడే పార్టీలోగ్రూపు రాజకీయాలు మొదలెట్టేశారు. అది కూడా తమకు మంచి బలముందని భావిస్తున్న అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా భావిస్తున్న తరుణంలో  కొత్తగా ఈ తలనొప్పులు ఏంటని చంద్రబాబు సతమతమవుతున్నారు.  

అసలు విషయానికి వస్తే రచ్చమెుదలైన నియోజకవర్గం రాయదుర్గం. ఈ నియోజకవర్గం ఏ చిన్న చితకా నేతదో కాదు బాబు కేబినేట్ లో కీలక మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసులుది. ఈ నియోకవర్గంలో కాల్వతోపాటు తాను కూడా రేస్ లో ఉన్నానంటూ మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనే నియోజకవర్గంలో కొత్త అలజడి రేపింది. 

అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ చీఫ్ విప్ పదవిని దక్కించుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీపై మాటలు తూటాలు పేల్చుతూ చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. దీంతో బాబు మెప్పుపొందిన కాల్వ ఆ తర్వాత కేబినేట్ విస్తరణలో ఏకంగా మంత్రి పదవి కొట్టేశారు. 

కేబినేట్ లో మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీలోనూ నియోజకవర్గంలోనూ జిల్లా రాజకీయాల్లోనూ తనకు ఎదురే లేదు అనుకుంటున్న తరుణంలో టీడీపీకి చెందిన పార్టీ సీనియర్ నేత రాయదుర్గం నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా సేవలందించిన మెట్టు గోవిందరెడ్డి షాక్ ఇచ్చారు. 

రాయదుర్గం మండలం హనుమాపురంలో మీడియాతో మాట్లాడిన గోవిందరెడ్డి 2019 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేసులో తాను కూడా ముందున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. పార్టీ కార్యక్రమంలో ఓ బహిరంగ వేదికపైనే గోవిందరెడ్డి చేసిన ఈ ప్రకటన చెయ్యడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
 
పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని మంత్రి కాల్వ శ్రీనివాసులకు పరోక్షంగా సవాల్ విసిరారు. తాను ప్రజాసేవలో మరింత సమయం గడపాలని ఇంకా చురుకైన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో రాయదుర్గంలో ఇల్లుకట్టుకుని ఇకమీదట ఇక్కడే గడపబోతున్నట్లు కూడా కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. 

కేబినేట్ లో ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మరో మాజీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాక్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నియోజకవర్గంలో తనకు ప్రతికూల వాతావరణం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిని చక్కదిద్దుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో మాజీఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో కాల్వ శ్రీనివాసులు ఆందోళనకు గురవుతున్నారట. 

ఇటీవల సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో సైతం రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులకు ఎదురుగాలి వీస్తోందని తేలింది. మళ్లీ రాయదుర్గం నుంచి పోటీ చేస్తే కాల్వ పరాభవం తప్పదని కూడా తేలింది. సర్వేతో ఖంగుతిన్న చంద్రబాబు కూడా పునరాలోచనలో పడినట్లు తెలిసింది.  

ఒకానొక దశలో కాల్వ శ్రీనివాసులను వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచన చేశారట. సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే వేరే నియోజకవర్గంలో ఇంకా దారుణంగా ఉంటుంది కదా అని భావించిన చంద్రబాబు కాల్వ భవితవ్యంపై తర్జన భర్జన పడుతున్నారు. 

కాల్వకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్ రావడంతో తనకు టిక్కెట్ కన్ఫమ్ అని మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ధీమాగా ఉన్నారు. కాల్వ శ్రీనివాసుల పరిస్థితిపై ఆరా తీసిన గోవిందరెడ్డి కాల్వకు వీస్తున్న ఎదురుగాలిని తనవైపుకు మళ్లించుకునేందుకు నేరుగా రంగంలోకి దిగిపోయారు. అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని చెప్పారని తెలుస్తోంది.

ఇకపోతే మెట్టు గోవిందరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. మౌనంగా ఉండిపోయారు. అటు గోవిందరెడ్డి మాత్రం నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏదో ఒకటి క్లియరెన్స్ వస్తుందని అప్పటి వరకు మౌనంగా ఉండాలని కాల్వ భావిస్తున్నారట. శుక్రవారం, శనివారం అనంతపురం జిల్లాలోనే చంద్రబాబు నాయుడు ఉండనున్న నేపథ్యంలో రాయదుర్గం పంచాయితీపై చర్చించే అవకాశం ఉంది. 
 

click me!