ఏపీలో రాజకీయ ఉగ్రవాదంతో భయపెడుతున్నారు : చంద్రబాబు

By AN TeluguFirst Published Jan 12, 2021, 12:24 PM IST
Highlights

రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరం తీసుకుని, విధ్వంసాలు, కక్ష సాధింపులు లేని సమాజాన్ని ఆవిష్కరించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరం తీసుకుని, విధ్వంసాలు, కక్ష సాధింపులు లేని సమాజాన్ని ఆవిష్కరించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా, ఉపాధి కల్పనా కేంద్రంగా అభివృద్ధి చేస్తే వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును అంధకారం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి అధఃపాతాళానికి తెచ్చారని మండిపడ్డారు. 

తెదేపా తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలన్నింటినీ తరిమేసి అభివృద్ధి నిలిపివేశారని విమర్శించారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేసి, స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారన్న చంద్రబాబు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు.  రాజకీయ ఉగ్రవాదంతో అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. 

వేలాది మంది యువతపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని, సామాజిక మాధ్యమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆలయాలపై దాడులు, విధ్వంసాలు లేవు. ఇంతటి కక్షసాధింపు పాలన, హింసాత్మక చర్యలు గతంలో చూడలేదు. 

బీసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై ఇంతటి దమనకాండ ఏ రాష్ట్రంలోనూ లేదు. చట్టసభలు, పాలనాయంత్రాంగం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, మీడియాపై దాడి చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత భుజాన వేసుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, భావితరాల ప్రగతికి దోహదపడాలని చంద్రబాబు సూచించారు.
 

click me!