హస్తినలో చంద్రబాబు బిజీబిజీ: జాతీయ మద్దతుకు ప్రయత్నం

By Nagaraju TFirst Published Oct 27, 2018, 9:26 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం కుట్రపన్నిందని రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న కుట్రను ఢిల్లీ కేంద్రంగానే తేల్చుకునేందుకు అమితుమీకి సిద్ధమయ్యారు. 
 

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజీబిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం కుట్రపన్నిందని రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న కుట్రను ఢిల్లీ కేంద్రంగానే తేల్చుకునేందుకు అమితుమీకి సిద్ధమయ్యారు. 

ఏపీలో కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హస్తిన చేరుకున్న చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న ఎంపీలతో ఏపీ భవన్ లో సమావేశమయ్యారు. 

ఎంపీలతో సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ఏపీభవన్ లోనే లోక్ తంత్రిక్ జనతాదళ్ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్, డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డిలతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఏపీలో ఐటీ దాడులు, జగన్‌పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణపై చర్చించారు. 

వీటితోపాటు రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ జోక్యంపై కూడా చంద్రబాబు నాయుడు వివరించారు. అలాగే దేశంలో సంచలనం సృష్టిస్తున్న రాఫెల్ కుంభకోణం, సీబీఐలో లంచం సీబీఐ డైరెక్టర్ తొలగింపు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో చర్చిస్తున్నారు చంద్రబాబు. కేంద్రం కుట్రలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నానని అందుకు సహకరించాలని కోరారు. డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌,టార్గెట్‌ ఏపీ పేరుతో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర కుట్రలను తెలియజేశారు. 

దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపైనే తాను చంద్రబాబుతో చర్చించానని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్నికాపాడుకోవడం ముఖ్యమన్నారు. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని, ఐకమత్యం సాధిస్తామని వెల్లడించారు. 

ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థి ఎవరనేది అవసరం లేదని గెలిచిన తర్వాత ప్రధాని అభ్యర్థిపై నిర్ణయించుకోవచ్చని తెలిపారు. రాహుల్‌ తానేమీ కూటమి నాయకుడిగా లేదా ప్రధాని అభ్యర్థిగా చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు. 

అటు బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీకి సాయం చేయడంలో కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్‌ అంశాలతో పాటు దేశంలోని రాజకీయ పరిణామాలు, తెదేపా లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను ఆమెకు వివరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబును మాయావతి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. సమావేశం అనంతరం కారుదాకా వచ్చి చంద్రబాబును మాయావతి సాగనంపారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి అన్నారు. 

 ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఎన్నికలు జరగుతున్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాలపై చంద్రబాబుతో మాయావతి చర్చించారు. 

click me!