కోడెల కుమార్తెపై కేసు.. తండ్రి అధికారం చాటున కబ్జాలు

By Siva KodatiFirst Published Jun 9, 2019, 10:38 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మీ విలువైన భూముల కబ్జాకు ప్రయత్నించడంతో బాధితులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మీ విలువైన భూముల కబ్జాకు ప్రయత్నించడంతో బాధితులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకు చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చచేసింది.

అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులపై కన్నేసిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీ లేని వివాదాలను సృష్టించారు. దీనిలో భాగంగా ఆమె అనుచరుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు.

నకిలీ పత్రాలు చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె కొనుగోలు చేశారని.. మరోసారి భూమి వద్దకు వచ్చి చంపేస్తానని బెదిరించారు. విజయలక్ష్మీ వద్దకు వెళ్లి ముడుపులు చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని లేకుంటే ఫెన్సింగ్ వేస్తామని బెదిరించారు.

దీంతో బాధితురాలు ఆమె కుమారుడితో కలిసి విజయలక్ష్మీని కలిశారు. పొలం విడిచి వెళ్లాలని లేకుంటే తమకు రూ. 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని అవి కూడా విడతల వారీగా చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు.

అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబుబుల్ తోటను నరికేందుకు పద్మావతి, ఆమె భర్త వెళ్లారు. రాంబాబు, శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని మరో రూ. 5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని... లేకుంటే చంపుతామని బెదిరించారు.

దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలిసి దాడికి పాల్పడ్డారు.

ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కోడెల కుమార్తె విజయలక్ష్మీ, ఆమె అనుచరులు కల్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

click me!