కష్టపడి చిట్టీ రూపంలో దాచుకున్న డబ్బులు తిరిగిరావనే మనోవేదనకు గురైన వ్యాపారి నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.
తిరుపతి: చిట్టీ డబ్బులతో తిరుచానూరు అమ్మవారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ స్వామి తిరుపతి నుండి పారిపోయాడు. ఈ చిట్టీ డబ్బులు దక్కవని మనోవేదనకు గురైన వ్యాపారి నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి భార్య తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తిరుపతిలోని తిరుచానూరు అమ్మవారు ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామి, ఆయన భార్య పద్మశ్రీవాణి లు చిట్టీల వ్యాపారం చేసేవారు. వీరి వద్ద వ్యాపారి నితిన్ చిట్టీ వేశాడు. అయితే చిట్టీ డబ్బులు చెల్లించకుండా బాబు స్వామి దంపతులు పారిపోయారు. చిట్టీ గడువు ముగిసి మూడేళ్లు దాటినా డబ్బులు అందలేదు. దీంతో మనోవేదనకు గురైన వ్యాపారి నితిన్ సూసైడ్ నోట్ రాసి ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నితిన్ భార్య పరమేశ్వరిబాయి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బాబుస్వామి దంపతలు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.