మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదు.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు: బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

By Sumanth KanukulaFirst Published May 14, 2022, 2:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుసని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి గ్రామాలలో జీవీఎల్ శనివారం పర్యటిస్తున్నారు. అమరావతి పర్యటనకు వచ్చిన జీవీఎల్‌కు రైతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ రైతుల కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. మూడు రాజధానులు  ఇక రాజకీయ నినాదమేనని  అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానులు సాధ్యం కాదని తెలుసు కాబట్టే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం లేదన్నారు. 

రాజధానిలో పనులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ నిర్ణయం అని స్పష్టం చేశారు.  

మరోవైపు జీవీఎల్ మందడంలోని టిడ్కో ఇళ్లను సందర్శించి జీవీఎల్.. అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. ఇళ్ల పట్టాల్లో ప్రధాని ఫొటో పెట్టలేదని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల దగ్గర ప్రధాని ఫ్లెక్సీలు పెట్టాలని బీజేపీ కార్యకర్తలకు జీవీఎల్ పిలుపునిచ్చారు.

ఇక, హైకోర్టు తీర్పు దృష్ట్యా జాప్యం లేకుండా అమరావతిలో వెంటనే కార్యాలయ భవనాల నిర్మాణాలు స్థాపించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలను జీవీఎల్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లేఖలు కూడా రాశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించాలని జీవీఎల్ నరసింహారావును రాజధాని అమరావతి రైతులు  పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. 

click me!