రాష్ట్రంలో ఆలయాలపై దాడులను ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
గుంటూరు: రాష్ట్రంలో ఆలయాలపై దాడులను ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.సోమవారం నాడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే దాడులు పెరిగాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేసి సాదా సీదా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. విదేశీ నిధులతో ప్రవీణ్ చేస్తున్న మత మార్పిడిల గురించి ఎందుకు విచారణ జరపలేదని ఆయన ప్రశ్నించారు.
ప్రవీణ్ వెనుక ఎవరు ఉన్నారో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిజమైన దోషులను పట్టుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పుల వల్లే ఇపుడు ఆలయాల దాడుల విషయం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.రాష్ట్రంలో పాస్టర్ల సంఖ్య ఎంత? ప్రభుత్వం ఎంతమందికి సహాయం చేస్తోందనే విషయాలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
సత్తెనపల్లి బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేసి.. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. బీజేపీ తలపెట్టిన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.
వర్షాల కారణంగా ఈసారి మిర్చి నాణ్యత తగ్గిందన్నారు. ఈనష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. కేవలం పెట్టుబడి రాయితీ ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు.
ప్రకృతి విపత్తుల నిధి నుంచి రైతులకు సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మిర్చి ఎగుమతుల ద్వారా ఏటా 6వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తోందని ఆయన చెప్పారు.అలాంటప్పుడు రైతులకు మరింత లాభం చేకూర్చేలా మిర్చి టాస్క్ ఫోర్స్ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు.రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఆపివేసిందని ఆయన ఆరోపించారు.
అన్ని పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కోసం మల్లిస్తోందని ఆయన విమర్శించారు.కార్పోరేషన్లకు కేటాయించిన నిధులను కూడా నవరత్నాల కోసం మళ్లించారన్నారు.