
జనసేనతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు చెప్పారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి జనసేనను సంప్రదించిన తర్వాతే బీజేపీ బరిలోకి దిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన ప్రత్యామ్నాయ కూటమిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తాయని తాము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు కూడా బీజేపీతోనే పొత్తు ఉందని చెప్పారని గుర్తుచేశారు. ఈ కూటమి 2024లో ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని చెప్పారు.
మరోవైపు విశాఖలోని రుషికొండ తవ్వకాలపై సుప్రం కోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. టూరిజం అభివృద్ది అంటూనే అక్కడ ఏదో స్కెచ్ వేసినట్టుగా అనుమానం కలుగుతుందన్నారు.రుషికొంద తవ్వకాలను కేంద్ర టూరిజం శాఖ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. రుషికొండలో ప్రైవేట్ ప్రాపర్టీ కోసం ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ACB పరిధిలోకి తెస్తే అవినీతి బయటపడుతుందని జీవీఎల్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.