సుజనా చౌదరికి షాక్: మార్చి 23న రూ.400 కోట్ల ఆస్తుల వేలం

By telugu teamFirst Published Feb 21, 2020, 11:00 AM IST
Highlights

సుజనా చౌదరికి బ్యాంక్ ఆప్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. అయనకు చెందిన కంపెనీ రుణం రూ.400 కోట్లకు ఆస్తులను వేలం వేయడానికి నోటీసు జారీ చేసింది. మార్చి నెల 23వ తేదీన ఆస్తుల వేలం జరగనుంది.

అమరావతి: బిజెపి పార్లమెంటు సభ్యుడు సుజనా చౌరిదికి బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ.400 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు నోటీసు జారీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పోరేట్ బ్రాంచ్ ఈ నోటీసులు జారీ చేసింది. 

హైదరాబాదులోని వెంగళవారు నగర్ కు చెందిన సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణబకాయిలను చెల్లించనందున ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఆ కంపెనీకి తీసుకున్న రుణానికి జమానతు ఇచ్చిన వ్యక్తులకు, సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది.

సుజనా యునివర్శల్ కంపెనీ సుజనా చౌదరికి చెందింది. ఈ సంస్థ తీసుకున్న బ్యాంక్ రుణాలకు గ్యారంటీ సంతకాలు పెట్టినవారు అంటూ సుజనా చౌదరి, వై. శివలింగ ప్రసాద్ (లేట్), వై. జతిన్ కుమార్, వై. శిమరామకృష్ణ, ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాస రాజులకు, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్థలకు బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. మార్చి 23వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేలం పాటలు జరుగుతాయి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2018 అక్టోబర్ 26వ తేదీన ర.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీకి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణాన్ని తీసుకుంది. అసలుకు వడ్డీ కలిపి అప్పు రూ.400.84 కోట్లకు చేరింది. అయితే దాన్ని తిరిగి చెల్లించడం లేదు. నోటీసులకు స్పందించడం లేదు. దీంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయడానికి బ్యాంక్ నోటీసు జారీ చేసింది. 

తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి ఆ తర్వాత బిజెపిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన బిజెపిలోకి వెళ్లారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆయన అత్యంత సన్నిహితులనే పేరుంది.

click me!