అన్నీ దేవుడు చూస్తున్నాడు, అందుకే ఆస్పత్రి పాలు: నిమ్మగడ్డపై బాలినేని

By telugu teamFirst Published Feb 8, 2021, 3:49 PM IST
Highlights

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అధికార వైసీపీ నుంచి విమర్శల జడివాన కురుస్తూనే ఉంది. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వ్యాఖ్యలు చేశారు.

ఒంగోలు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అన్నీ దేవుడు చూస్తున్నాడని, అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటికి ఇన్ ఫెక్షన్ సోకిన విషయం తెలిసిందే. దానికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో చికిత్స చేయించుకోవడానికి హైదరాబాదు వెళ్లే అవకాశం ఉంది. దీన్ని ఉద్దేశించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు హౌస్ అరెస్టు చేశారో అర్థం కాలేదని ఆయన అన్నారు. పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను హైకోర్టు చీవాట్లు పెట్టిందని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ ఏజెంటుగా పనిచేస్తున్నారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం మంది వైసీపీ మద్దతుదారులే గెలుస్తారని ఆయన అన్నారు. ఎన్నికలకు వైసీపీ ఏ రోజు కూడా భయపడలేదని ఆయన చెప్పారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఈ రోజు, సోమవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలువనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూపైన, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడంపైన ఆయన గవర్నర్ తో మాట్లాడే అవకాశం ఉంది. 

పెద్దిరెడ్డి రమాచంద్రా రెడ్డి ఎన్నికల అధికారులను బెదిరించారనే ఆరోపణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా స్పందించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దానిపై ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ తీవ్రంగా స్పందించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రివిలెజేస్ కమిటీ దృష్టి పెట్టింది.

కాగా, రేపు మంగళవారం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3,249 గ్రామాల్లో రేపు పోలింగు జరుగుతుంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం శానిటైజర్లు, మాస్కులు కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పర్యటించారు.

click me!