బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే సూరి: రంగంలోకి దిగిన బాలకృష్ణ

By narsimha lodeFirst Published Jul 4, 2019, 10:57 AM IST
Highlights

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ  నియామకం కోసం  నేతలను ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది

అనంతపురం:: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ  నియామకం కోసం  నేతలను ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది. కొత్త నేత ఎంపిక కోసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను చంద్రబాబునాయుడు రంగంలోకి దించాడు. ఐదు రోజుల క్రితం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

.పరిటాల రవి బతికున్న కాలంలో  వరదాపురం సూరి టీడీపీలో ఉండేవారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2012లో సూరి తిరిగి టీడీపీలో చేరారు. ఆ సమయం నుండి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు.

2014 ఎన్నికల్లో ధర్మవరం నుండి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో  మరోసారి ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే వరదాపురం సూరి చంద్రబాబునాయుడును కలిసి వచ్చారు. ఆ తర్వాత  ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

గత శుక్రవారం నాడు వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అంతకుముందే ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. సూరి బీజేపీలోకి చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో మాజీ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, కాలువ శ్రీనివాసులు,  బీకే పార్థసారథి తదితరులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

వరదాపురం సూరి టీడీపీని వీడి  బీజేపీలో చేరడంతో  ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీ నియామకం టీడీపీ జిల్లా నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది. బుధవారం నాడు  పార్టీ కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.

ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జీని ఎంపిక చేసే విషయమై బాలకృష్ణను చంద్రబాబు రంగంలోకి దించినట్టుగా సమాచారం. ఈ విషయమై బాలకృష్ణ  పార్టీ నేతలతో చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. స్థానికంగా ఉన్న పలువురు పార్టీ నేతల పేర్లను కూడనాయకత్వం సేకరించినట్టుగా తెలుస్తోంది.

ధర్మవరం నియోజకవర్గంతో  పరిటాల కుటుంబానికి సన్నిహిత సంబధాలు ఉన్నాయి. పరిటాల రవి బతికున్న సమయంలో  ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జీ బాధ్యతలను పరిటాల శ్రీరామ్‌కు అప్పగిస్తే ఉపయోగమనే చర్చ కూడ లేకపోలేదు. 

అయితే  ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ రాఫ్తాడు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే రాఫ్తాడు వదిలి శ్రీరామ్ ధర్మవరంలో కేంద్రీకరిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.  ఈ నెల 8వ తేదీన చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ధర్మవరంలో ఇంచార్జీ ఎంపిక కోసం బాబు కసరత్తు నిర్వహించే అవకాశం లేకపోలేదు.


 

click me!