ప్రజా వేదిక కూల్చి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి వైసిపి ప్రభుత్వానిదని టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి: నెల్లూరు సభలో సీఎం జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దేవాలయాలను ధ్వంసం చేసి పరిశీలనలకు వెళ్తున్నాయన్న జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రేపు బడులు మీద దాడులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ జగన్ శ్రీరంగ నీతులు చెప్తున్నారని... తరువాత మీ లక్ష్యం బడులు మీద పెట్టుకుని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తారనే అనుమానం కలుగుతోందన్నారు అచ్చెన్నాయుడు.
''విధ్వంసాలు చేసే సంస్కృతి ఎవరిది? తెల్లారి లేస్తే రాష్ట్రంలో ఏదో ఒక విధ్వంసం జరిగేతేనే మీకు నిద్ర పడుతుంది. విధ్వంసంతోనే మీ పరిపాలన ప్రాంరభమైంది. ప్రజా వేదిక కూల్చి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి మీది. రాష్ట్రలో అధికారంలో ఉంది నువ్వే.. జరిగిన దాడులపై బాధ్యత నీదే. 140 దాడులు జరిగితే ఒక్కరోజైనా స్పందిచావా?'' అంటూ సీఎం జగను నిలదీశారు.
''నీ కనుసన్నల్లో దేవాలయాలపై దాడులు జరిగాయి. అందువల్లే దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శన చేయలేదు. చంద్రబాబు, లోకేష్ ఇంట్లో ఉన్నారంటున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు.? తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చున్నావు.? మనిషి అనే వాడు మాట్లాడే మాట్లేనా ఇవి?'' అంటూ మండిపడ్డారు.
''ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వస్తుందా? మీ పుట్టిన రోజులు చేస్తే కరోనా రాదా? బ్రాందీ షాపులు, స్కూళ్లు తెరిస్తే కరోనా రాదా? బ్రాందీ అమ్మి వాళ్ల రక్తం తాగితే కరోనా రాదా? చేతకాని తనాన్ని, అసమర్థతను ఇతర పార్టీల మీద పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. నీ దగాను ప్రజలు తెలుసుకున్నారు'' అంటూ విరుచుకుపడ్డారు.
''ఇతర పార్టీలపై నీ తప్పులను పెట్టడం దారుణం. దేవాలయాలపై మొదటి దాడి జరినప్పుడే ఖండించి పోలీసులకు సరైన సూచనలు ఇచ్చివుంటే 140 ఘటనలు జరిగేవి కాదు.ఇకపై ఏ ఆలయం, బడి మీద దాడి జరిగినా కర్త, కర్మ, క్రియగా జగనే ఉంటారు’’ అని సీఎం జగన్ పై విమర్శల వర్షం గుప్పించారు అచ్చెన్నాయుడు.