ఏపీ ఈపీడీసీఎల్‌లో భారీ కుంభకోణం: సీఎండీగా హెచ్‌.వై దొర రాజీనామా

By Siva KodatiFirst Published Feb 19, 2019, 10:09 AM IST
Highlights

విశాఖ కేంద్రంగా నడిచే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) లో భారీ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ సంస్థ సీఎండీ హెచ్‌వై. దొర రాజీనామా చేశారు.

విశాఖ కేంద్రంగా నడిచే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) లో భారీ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ సంస్థ సీఎండీ హెచ్‌వై. దొర రాజీనామా చేశారు. 2016లో కవర్డ్ కండక్టర్ల టెండర్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ఈపీడీసీఎల్‌లోనూ ఇదే తరహా అవినీతి చోటు చేసుకున్నట్టు ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ లో తేలింది.

సీఎండీ దొరతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌ పరిధిలోని సుమారు 20 నుంచి 30 మంది ఉన్నతాధికారులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. రెండు డిస్కంలలోనూ కలిపి రూ.131 కోట్ల అక్రమాలు జరిగినట్టు సమాచారం.

దీనిపై గతేడాది జూలైలోనే దీనికి సంబంధించిన నివేదికను విజిలెన్స్ అందజేసింది. దీంతో దొరపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని సమాచారం. కవర్డ్ టెండర్లల కొనుగోలు అవకతవకలకు సంబంధించి హెచ్ దొరపై ట్రాన్స్‌కో విజిలెన్స్ ఇచ్చిన నివేదికతో పాటు కోర్టులోనూ కేసులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో దొర గత శుక్రవారం తన పదవికి రాజీనామా చేయగా.. సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ఎంఎం నాయక్‌కు ఈపీడీసీఎల్‌ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని హెచ్.వై దొర స్పష్టం చేశారు. రాజీనామాకు ప్రత్యేక కారణాలేవి లేవని ...అయితే పనిపరంగా కొంత ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడం గమనార్హం.
 

click me!