
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్‌కు సూటిగా సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమం కోరుకునేవారైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని అన్నారు. అలా చేస్తే.. పవన్ ఏపీలో ఏ స్థానం నుంచి పోటీ చేసినా... అక్కడ ఒక వాలంటీర్‌ను పోటీకి నిలిపి పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తామని సవాల్ విసిరారు. ఈ సవాల్ స్వీకరించే దమ్ము పవన్‌కు ఉన్నదా అంటూ నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థ విజయవంతం కావడం పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఆయన కక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో నివసిస్తారని, అలాంటప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని జోగి రమేశ్ అన్నారు. పవన్ కళ్యాణ్‌కు ప్రజల పై ప్రేమ అభిమానం ఉంటే.. పొత్తులకు పోరాదని, ఒంటరిగానే బరిలోకి దిగాలని సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్ గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? అని అడిగారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన స్క్రిప్ట్ రాసిస్తే.. ఈయన చదువుతున్నారని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా అంతకు ముందే ఓ చాలెంజ్ చేశారు. వైసీపీ నవరత్నాలను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నవరత్నాలను చూసి, జగన్ పాలనలో సంక్షేమం గురించి యావత్తు దేశం మాట్లాడుకుంటున్నదని అన్నారు. సంక్షేమ పథకాల గురించి గడప గడపకు వెళ్లి చర్చించిన ప్రభుత్వం దేశంలో మరెక్కడైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. దీనిపై చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. కుప్పం, టెక్కలిలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు పొందిన ప్రయోజనాలేమిటో చర్చించడానికి సిద్ధమా? ఆ సత్తా ఉన్నదా? అంటూ ప్రశ్నించారు.