అమూల్ కోసం .. వేలాది డెయిరీ ఉద్యోగులను బలి చేస్తారా: జగన్‌కు అచ్చెన్నాయుడు ఘాటు లేఖ

Siva Kodati |  
Published : Jan 29, 2022, 05:51 PM IST
అమూల్ కోసం .. వేలాది డెయిరీ ఉద్యోగులను బలి చేస్తారా: జగన్‌కు అచ్చెన్నాయుడు ఘాటు లేఖ

సారాంశం

పాడి రైతులకు ఇచ్చిన హామీల అమలులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (Ys jagan) విఫమమయ్యారని ఏపీ టీడీపీ (tdp) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) మండిపడ్డారు. పాడి రైతులకు ఇచ్చిన ఏ హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.

పాడి రైతులకు ఇచ్చిన హామీల అమలులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (Ys jagan) విఫమమయ్యారని ఏపీ టీడీపీ (tdp) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) మండిపడ్డారు. పాడి రైతులకు ఇచ్చిన ఏ హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. పాడి రైతుల సమస్యలపై సీఎం జగన్‌కు శనివారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులకు ఇస్తామన్న రూ.4 బోనస్‌ ఏమైందని లేఖలో ఆయన ప్రశ్నించారు. అమూల్‌ (amul) కోసం ఉపాధి హామీ నిధులనూ దారి మళ్లిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

అమూల్‌పై ఉన్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. అమూల్ వల్ల రూ. 5 నుంచి రూ. 20 వరకు అదనపు లబ్ధి అనేది అవాస్తవమని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రానికి చెందిన డెయిరీలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని... అమూల్‌ కోసం రూ. 3 వేల కోట్ల ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (peddireddy rama chandra reddy) చెందిన శివశక్తి పాల డెయిరీలో రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు పాలు కొంటున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా లీటర్‌ పాలకు రూ. 18 చెల్లించారా? రాష్ట్రంలోని సహకార డెయిరీలు, ఇతర సంస్థలను వదిలిపెట్టి బాలామృతం, అంగన్‌వాడీలకు పాల సరఫరా కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఉన్మాద, కక్ష సాధింపు చర్యలతో ఆయా డెయిరీల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సహకార డెయిరీలను పునరుద్ధరిస్తామనే హామీని నెరవేర్చాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

కాగా..గుడివాడ క్యాసినో వ్యవహారంపైనా అచ్చెన్నాయుడు కొద్దిరోజుల క్రితం ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గంజాయి బ్యాచ్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలపై హత్యా యత్నం చేశారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కాసినో గుట్టు బయట పడుతుందనే భయంతోనే గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు నడయాడిన గుడివాడను గుట్కా బ్యాచ్ మట్కాకు, వ్యసనాలకు కేంద్రం చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

ఎన్.టీ.ఆర్. టూ వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పనికిమాలిన పనులు చేస్తూ.. ఎన్.టీ.ఆర్ పరువు తీస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.  క్యాసినో, జూదం, క్యాబరే డాన్స్‌లు పెట్టి యువత జీవితాలు నాశనం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. కొడాలి నాని కోడె తాచులా స్థానిక యువతను నాశనం చేస్తున్నాడని  ఆరోపించారు. కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను వీడియోలు, సాక్ష్యాలతో సహా బయట పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 

ఇప్పుడు మంత్రి నిస్సిగ్గుగా అక్కడేం జరగలేదు అంటూ బుకాయిస్తున్నాడని...  బహిరంగంగా గుడివాడలో క్యాసినో, జూదం, క్యాబరే నడిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా.? అని ఆయన ప్రశనింనచారు. క్యాసినో నుండి వచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి అన్నీ తెలిసీ నిద్ర నటిస్తున్నారా అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు పక్కనే ఉంది కూడా అడ్డుకొకపోవడం దుర్మార్గమన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu