సత్యసాయి జిల్లాలో కూలీల సజీవదహనం... బాధ్యత ప్రభుత్వానిదే...: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Jun 30, 2022, 11:17 AM IST
Highlights

సత్యసాయి జిల్లాలో ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి కూలీలు సజీవదహనం అయిన దుర్ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ టిడిపి చీఫ్ అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. 

అమరావతి : ఇవాళ తెల్లవారుతూనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన కొందరు వ్యవసాయ కూలీల బ్రతులకు తెల్లారిపోయాయి. వ్యవసాయ పనులకోసం కోసం వెళుతున్న కూలీలతో కూడిన ఆటో ఘోర ప్రమాదానికి గురయ్యింది.  ఆటో హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో కూలీలకు విద్యుత్ షాక్ తగలడమే కాదు ఆటోలో మంటలు చెలరేగాయి. దీంతో ఆటోడ్రైవర్ సహా ఎనిమిదిమంది సజీవ దహనం అయ్యారు. అయితే ఈ దుర్ఘటనకు వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంలో కూలీల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అచ్చెన్నాయుడు అన్నారు. పోట్టకూటికోసం వెళుతున్న మహిళా కూలీల సజీవదహనం బాధాకరమని... బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. కూలీ పనులు చేసకుంటూ కుటుంబాన్ని పోషించేవారు ప్రాణాలు కోల్పోయారు... కాబట్టి ప్రభుత్వమే బాధిత కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. 

హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగి కూలీల ప్రాణాలు బలయ్యాయి... కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని అచ్చెన్న అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. 

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంలో కూలీల సజీవదహనం ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి కూలీలు మృతిచెందడం విచారకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను గవర్నర్ ఆదేశించారు. 

ఇక కూలీల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.  హైటెన్షన్ విద్యుత్ వైర్ల నుండి నిప్పురవ్వలు రావడం గమనించామని స్థానికులు చెబుతున్నారు. అయితే విద్యుత్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వుంటే ఇంత మారణహోమం జరిగేది కాదని అభిప్రాయపడుతున్నారు.  

కూలీల మృతితో ధర్మవరం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది.  తాడిమర్రి మండలం పెద్దకొట్టాల పంచాయితీ గుడ్డంపల్లిలో అయితే కూలీల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.    ప్రమాదం జరిగిన చిల్లకొండాయపల్లి వద్ద కూడా భయానక వాతావరణం నెలకొంది. ఆటోతో పాటు మృతదేహాలు మంటల్లో కాలుతుండటంతో రోడ్డే ఓ స్మశానవాటికను తలపిస్తోంది. 

ఈ ప్రమాదంలో మరణించిన వారంతా మహిళలేనని గుర్తించారు. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు. ఆటోలో మొత్తం డ్రైవర్ తో సహా 12మంది వుండగా కొందరు మృతిచెందగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 

కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను ట్రాక్టర్‌లో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుల ఇంటివద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

click me!