రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న స్నేహా బ్లాక్‌ను డీఐజీ రవికిరణ్ పరిశీలించారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న స్నేహా బ్లాక్‌ను డీఐజీ రవికిరణ్ పరిశీలించారు. జైళ్ల నిబంధనల మేరకు చంద్రబాబుకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. చంద్రబాబు భద్రతపై ఆయన తరఫు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజున జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సతీమణి భువనేశ్వరి.. జైలులో చంద్రబాబుకు నెంబర్ వన్ సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఆయన భద్రతపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనిఖీలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైయిన చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించారు. అలాగే ఇంటి భోజనం అందించేందుకు అనుమతి ఇస్తున్నారు.
ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తాను గతంలో పీపీగా పనిచేశానని.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తానని చంద్రబాబు లాయర్‌ను ప్రశ్నించారు. అయితే ఇందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో చంద్రబాబు సీఐడీ కస్టడీపై ఈ నెల 18 వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది.