నా నియోజవకర్గంలోనే ఇంత దౌర్జన్యమా..: వైసిపి తీరుపై చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Feb 9, 2021, 2:57 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండల ఎంపీడీవో కార్యాలయంలో వైసిపి నాయకులు దౌర్జన్యానికి దిగారని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు.

కుప్పం: నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే గెలవటం అసాధ్యమని వైసీపీ నేతలు బెదిరింపు చర్యలకు, దౌర్జన్యాలకు దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.చిత్తూరు జిల్లాలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండల ఎంపీడీవో కార్యాలయంలో వైసిపి నాయకులు దౌర్జన్యానికి దిగారని అన్నారు.ఈరోజు నామినేషన్ల స్క్రూటినీ సమయంలో అధికారులను వైసీపీ నేతలు బ్లాక్‌మెయిల్‌ చేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే వృక్షాన్ని పెకిలించే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో దౌర్జన్యం చేసిన వైసీపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పౌరులంతా నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

read more    జైల్లోంచి బయటకు వస్తూ భావోద్వేగం... కంటతడిపెట్టిన అచ్చెన్నాయుడు

ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలని ఆదేశించారు. ఇందుకోసం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సీఎం జగన్ ఒక సైకో అని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్ కు ఒక చెక్ పెట్టాలని పార్టీ నేతలతో అన్నారు. మనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని... వాటికి భయపడిఎవరు వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వెళ్ళాలన్నారు. కేసులు పెట్టినా, జైలుకి వెళ్లినా వెనక్కి తగ్గకుండా టీడీపీ నేతలు పోరాడుతున్నారని అన్నారు.

 పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎవరు విశ్రమించవద్దని సూచించారు. నిరంతరం గ్రామాల్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలన్నారు. ఓటమి భయంతో అక్రమ నిర్బంధాలకు దిగడం అనైతికం అన్నారు.  హోం మంత్రి సొంత నియోజకవర్గంలో వైసీపీకి మద్ధతుగా పోలీసులు అక్రమ నిర్బంధాలు చేపట్టడం దారుణమన్నారు. 

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో సర్పంచ్ గా పోటీచేస్తున్న అభ్యర్థి భర్త సునీల్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షుడిని అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇటువంటి అప్రజాస్వామిక విధానాలకు దిగుతున్నారని మండిపడ్డారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ నేతలను విడిచిపెట్టి.. ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

click me!