ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓ వైపు దొంగ ఓట్ల కలకలం.. మరోవైపు ఓట్ల గల్లంతు..!!

Published : Mar 13, 2023, 01:49 PM IST
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓ వైపు దొంగ ఓట్ల కలకలం.. మరోవైపు ఓట్ల గల్లంతు..!!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 పట్టభద్రల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. తిరుపతిలోని సంజయ్‌ గాంధీ కాలనీలో దొంగ ఓట్లు వేస్తున్న పలువురు పట్టుబడ్డారు. పదో తరగతి చదివిన ఓ మహిళ.. పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకన్న ఘటన వెలుగుచూసింది. అనుమానంతో మహిళను ప్రశ్నించగా.. పదో తరగతి మాత్రమే చదివినట్లు స్వయంగా ఆమే చెప్పింది. తాను తమిళనాడు వాసినని... వాలంటీర్ ఓటర్ స్లిప్పు ఇచ్చి ఓటేయాలని పంపారని సదరు మహిళ తెలిపింది. అసలు ఇవి ఏ ఎన్నికలో కూడా తనకు తెలియదని సదరు మహిళ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పలు చోట్ల టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ ఇష్టారీతిన వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వహించినట్టుగా కనిపిస్తోంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేవని ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఓట్లు గల్లంతు కావడంతో కూడా ఓటర్లు ఇళ్లకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి పలు సంఘటనలను తన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం, ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు, కడప - అనంతపురం - కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి 10,00,519 మంది ఓటర్లు ఉండగా.. 1,172 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు 55,842 మంది ఓటర్లు ఉండగా.. 351 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు మొత్తం 3,059 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu