జగన్ చివరి అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడానికి కారణం అదే: నారాయణ

By Nagaraju penumalaFirst Published Feb 1, 2019, 9:19 PM IST
Highlights

ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీని ఎక్కడ తిట్టాల్సి వస్తోందనన్న భయంతో అసెంబ్లీకి డుమ్మాకొట్టారని సరికొత్త భాష్యం చెప్పారు. అందుకే జగన్ రాలేదు, ఆయన ఎమ్మెల్యేలను కూడా రానియ్యకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇది జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. 

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆఖరి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాకపోవడానికి సరికొత్త కారణం చెప్పారు మంత్రి నారాయణ. అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అసెంబ్లీకి వస్తే కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాల్సి వస్తోందని రాలేదని చెప్పుకొచ్చారు. 

ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీని ఎక్కడ తిట్టాల్సి వస్తోందనన్న భయంతో అసెంబ్లీకి డుమ్మాకొట్టారని సరికొత్త భాష్యం చెప్పారు. అందుకే జగన్ రాలేదు, ఆయన ఎమ్మెల్యేలను కూడా రానియ్యకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇది జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. 

మరోవైపు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. చివరి బడ్జెట్లోనైనా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశించామని కాని నిరాశే మిగిల్చిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. 

రాజధాని నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి అలాగే దుగ్గరాజపట్నం పోర్టు వంటి ఎన్నో అంశాలను ఈ బడ్జెట్లో పేర్కొనకపోవడం రాష్ట్రానికి తీరని అన్యాయమే అవుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. 

నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. మోదీ విధానాల వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలంటేనే ఖాతాదారులు హడలిపోతున్నారని విమర్శించారు. 

click me!