నిరుద్యోగ యువతకు శుభవార్త...డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్ పై ఐటీ మంత్రి ఆదేశం

By Arun Kumar PFirst Published Jul 24, 2020, 7:36 PM IST
Highlights

ఐ.టీ రంగంలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి సారించాలని ఆ శాఖ అధికారులకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. 

అమరావతి: ఇండస్ట్రియల్ పాలసీతో పాటే ఐటీ పాలసీనీ  త్వరలో ప్రకటించేలా సమాయత్తమవుతున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం మంత్రి అధ్యక్షతన ఐ.టీ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐ.టీ రంగంలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఐ.టీ పాలసీపై తుది కసరత్తు పూర్తిలో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ఐ.టీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు ఎలాంటి ఆటంకం రాకుండా అన్ని విధాల సన్నద్ధమవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇంటర్నెట్ కనెక్టిటివిటీ సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్-19 విజృంభణ తరుణంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఐ.టీ బడ్జెట్, వినియోగంతో పాటు తదితర శాఖాపరమైన ఆర్థిక అంశాలపై మంత్రి మేకపాటి ఆరా తీశారు.

వివిధ రంగాలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అన్ని రంగాలలో ఉపాధి కల్పనకు సంబంధించిన ''డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్'' పై మంత్రి చర్చ జరిపారు. విద్య, అర్హతలు, అవకాశాలు తెలుసుకుని ఉద్యోగ ప్రయత్నాలు సాగించే వారికోసం ఒక ప్లాట్ ఫామ్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఐ.టీ నైపుణ్యంలో భాగంగా హై-ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (IIDT) గురించి చర్చించారు.

read more   నాలుక అదుపులో పెట్టుకో: మాజీ ఎంపీ హర్షకుమార్‌కు మంత్రి విశ్వరూప్ వార్నింగ్

పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ(APITA),ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (APSAC), సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ (SAPNET)లను ఒక తాటిపైకి తీసుకురావడంపైనా కార్యదర్శి భాను ప్రకాశ్, సలహాదారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చర్చించారు.  అపిట, ఏపీసాక్, సాప్ నెట్ లను ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెట్ (APSFL) కిందకు తీసుకురావడంపై మంత్రి ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు.  

ఐ.టీ శాఖలో ఐఎస్బి భాగస్వామ్యంపైనా మంత్రి సమీక్ష నిర్వహించారు. శిక్షణ, సంస్థాగత నిర్మాణాలపై అధ్యయనం, ఆర్థిక సర్దుబాటు, పెట్టుబడుల ఆకర్షణ అంశాలలో ఐఎస్బి సౌజన్యం, వినియోగించుకునే పద్ధతిపై చర్చించారు.

'మీ-సేవ' ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.  'మీ-సేవ' టెక్నికల్ గా గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపై ఐ.టీ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి మేకపాటి పలు కీలక సూచనలిచ్చారు. 'మీ- సేవ'లను పంచాయతీ రాజ్ శాఖకు అప్పగిస్తూ జీవో వచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఆ విభాగం ఐ.టీ పరిధిలోనే ఉందని స్పెషల్ సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. దీన్ని జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి 'మీ-సేవ' ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మేకపాటి ఆదేశించారు.

ఐ.టీ శాఖపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆ శాఖ కార్యదర్శి యేటూరు భాను ప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి(టెక్నికల్), దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (టెక్నికల్), ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. 

click me!