జగన్ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి... వలస కూలీలకు అండగా కీలక ఆదేశాలు

By Arun Kumar P  |  First Published May 23, 2020, 10:38 AM IST

వలస కూలీలకు అండగా నిలిచింది ఏపి హైకోర్టు. లాక్ డౌన్ కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 


అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. నివాసముంటున్న ప్రాంతంలో ఉండలేక, సొంతరాష్ట్రాలకు వెళ్లడానికి రవాణా సహకారం లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాంటివారికి ఏపి హైకోర్టు అండగా నిలిచింది. 

Latest Videos

undefined

వలస కూలీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వలస కార్మికుల పేరు నమోదు చేసుకున్న 48 గంటల్లో వారికి బస్సులు ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే 98 గంటల్లో రైలుసదుపాయం కల్పించి వారిని స్వస్థలాలకు పంపించాలని ఆదేశించింది.  

 అయితే అందుకు అనుగుణంగా తాము వలస కార్మికుల గురించి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపున ఏజి హైకోర్టుకు విన్నవించారు. వారికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే శిబిరాల్లో ఎందుకు ఉండకుండా నడిచి వెళ్లారంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇది విమర్శలకు సమయం కాదని, వలస కూలీల సమస్యలు  మానవతా దృక్పథంతో చూడాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. 

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో పలువురు వలస కూలీలు గాయపడ్డారు. నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. 

కొంత మంది వలస కూలీలు నడుచుకుంటూ, మరికొంత మంది సైకిళ్లపై తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్వయంగా పలకరించారు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడి వలస కూలీలకు పునరావాస కల్పించి, వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో వారికి అధికారులు విజయవాడ క్లబ్ లో పునరావాసం కల్పించారు. వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. 

అల్పాహారం అందడంలో ఆలస్యం కావడంతో దాదాపు 150 మంది కూలీలు బయటకు వచ్చి తమ స్వస్థలాలకు దారి పట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జీ చేశారు. దాంతో వారు తలో దిక్కు పరుగెత్తారు. ఆ తర్వాత వారిని విజయవాడ క్లబ్ కు చేర్చారు. వారి వివరాలను సేకరించారు.

ఉత్తరప్రదేశ్,  ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస కూలీలు వచ్చారు. తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారు. తమను పోలీసులు విచక్షణారిహతంగా కొట్టారని వలస కూలీలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
 

click me!