పరిషత్ ఎన్నికలు: ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

By narsimha lodeFirst Published Apr 7, 2021, 11:26 AM IST
Highlights

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై  స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో బుధవారం నాడు వాదనలు ప్రారంభమయ్యాయి.


అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై  స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో బుధవారం నాడు వాదనలు ప్రారంభమయ్యాయి.టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వేసిన పిటిషన్ ను ఆధారంగా చేసుకొని  హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఎన్నికలపై స్టే విధించడాన్ని  ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.  

వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి కాదని తెలిపింది. వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్ ను  హైకోర్టు  కొట్టివేసి ఉండాల్సి ఉందని  ఏపీ ఎస్ఈసీ అభిప్రాయపడింది.  అంతేకాదు నాలుగు వారాల కోడ్ ఉండాలనే నిబంధన లేదని ఎస్ఈసీ హైకోర్టు కు తెలిపింది.

ఈ విషయాలను ప్రస్తావిస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్వీకరించింది. ఈ పిటిషన్ పై డివిజన్ బెంచ్ లో బుధవారం నాడు ఉదయం విచారణ ప్రారంభమైంది.  డివిజన్ బెంచ్ ఏ రకమైన తీర్పు ఇస్తోందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పోలింగ్ కోసం  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ విషయమై జిల్లా ఎన్నికల అధికారుల నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున తాము పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ మెటిరీయల్ ను తరలిస్తున్నామని ఎన్నికల సిబ్బంది ప్రకటించారు.
 

click me!