విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి సర్వం సిద్దం...భక్తులకు మార్గదర్శకాలివే

By Arun Kumar PFirst Published May 15, 2020, 7:50 PM IST
Highlights

 భక్తులకు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దర్శనభాగ్యాన్ని అతి  త్వరలో కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

విజయవాడ: కరోనా వ్యాప్తి కారణంగా మూతపడిన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ తలుపులు తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యాన్ని కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.  కాబట్టి దుర్గమ్మ దర్శనం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులకు అతిత్వరలో ఆ భాగ్యం కలగనుందన్న మాట. 

అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా  నియమనిబంధనలు పాటించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ  ప్రత్యేక సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని... ఎస్ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీచేశారు. 

దర్శనానికి 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను చేశారు దేవస్థానం అధికారులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలుతీసుకుంటున్నారు. 

భక్తుల ఆధార్ నెంబర్‌తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎమ్మెస్‌లలో  భక్తులకు సమాచారం అందివ్వనున్నారు. అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణి నిలిపి వేస్తూ కేవలం దర్శన్నాన్ని మాత్రమే కల్పించేలా అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. 

click me!