మా సత్తా ఏంటో చూపిస్తాం, పవన్ కు భద్రత కల్పిస్తాం : డీజీపీ ఠాకూర్

By Nagaraju TFirst Published Sep 29, 2018, 7:28 PM IST
Highlights

మావోయిస్టులపై ఏపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి కోసమే మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడుతున్నారని డీజపీ మండిపడ్డారు. అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు హతమార్చారన్నారు. లివిటిపుట్టుకు మావోలు ఎలా వచ్చారో తమకు సమాచారం ఉందన్నారు. 

అమరావతి: మావోయిస్టులపై ఏపీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి కోసమే మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడుతున్నారని డీజపీ మండిపడ్డారు. అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు హతమార్చారన్నారు. లివిటిపుట్టుకు మావోలు ఎలా వచ్చారో తమకు సమాచారం ఉందన్నారు. 
ఎమ్మెల్యే సమాచారాన్ని ఎవరిచ్చారో.. దాడిలో ఎవరు పాల్గొన్నారో తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏజెన్సీని జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్‌ సత్తా ఏంటో మావోయిస్టులకు చూపిస్తామని డీజీపీ హెచ్చరించారు.
 
మరోవైపు ఉనికి కోసమే మావోలు అరకు ఘటనకు పాల్పడ్డారని తెలిపారు. గతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తుందన్నారు. అయినా గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న నేతలను హత్య చేయడం సరికాదన్నారు. 

దాడిలో పాల్గొన్న వారిలో ఇద్దరు మినహా మిగిలినవాళ్లంతా ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వచ్చినట్లుగా గుర్తించామన్నారు. మావోల టార్గెట్‌లో ఉన్న ప్రజాప్రతినిధులకు భద్రత పెంచామని వివరించారు. 

అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరితే భద్రత కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఉండేందుకు కొందరు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన హత్యకు సంబంధించి ముగ్గురు మాట్లాడుకుంటున్నారని ఆ వాయిస్ తన దగ్గర ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో డీజీపీ పవన్ కోరితే భద్రత కల్పిస్తామని తెలిపారు. 

click me!