చంద్రగిరి రీపోలింగ్ వెనుక ఎల్వీ సుబ్రమణ్యం: మరో వివాదంలో సీఎస్

By Siva KodatiFirst Published May 17, 2019, 8:35 AM IST
Highlights

పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి

పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి.

తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ వద్దంటుండగా... వైసీపీ నేతలు జోష్‌లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి రీపోలింగ్‌ వివాదంలోకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వచ్చి చేరారు. సీఎస్ సూచనల మేరకే సీఈవో ద్వివేది రీపోలింగ్‌కు సిఫార్సు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ నెల ఆరో తేదీన రీ పోలింగ్ చేయాలంటూ సీఎస్ ఎల్వీని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కోరారు. ఈ క్రమంలో చెవిరెడ్డి ఫిర్యాదు ఫరిగణనలోకి తీసుకోవాలని సీఎస్ కోరుకుంటున్నారంటూ ద్వివేదికి సీఎస్ ఓఎస్డీ లేఖ రాశారు.

దీంతో ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సీఈవోకు ఫిర్యాదు చేయకుండా ఎల్వీ సుబ్రమణ్యం దగ్గరకు చెవిరెడ్డి ఎందుకు వెళ్లారని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో సీఎస్ జోక్యం ఎందుకు..? అని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

సీఎం చంద్రబాబుతో వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఎన్నికల వ్యవహారంలో ఎల్వీ వేలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

click me!