
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే పరిపాలనలో ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించిన సీఎం వైఎస్ జగన్.. సమీర్ శర్మ కోసం కొత్త పదవినే సృష్టించారు. పదవీ విరమణ తర్వాత సమీర్ శర్మను ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హోదాలో ఆయన సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఇక సమీర్ శర్మతో పాటు రేపు పదవీ విరమణ చేయనున్న మరో సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్ కోసం కూడా జగన్ ప్రభుత్వం కొత్త పోస్ట్‌ను సృష్టించింది. స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఆయనను నియమిస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికా సంఘం ఎక్స్ అఫీషియో సెక్రటరీ హోదాలో విజయ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Also Read:ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన సీఎస్ నియామకం చేపట్టింది. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1990 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.
అలాగే రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్యకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సెలవుపై ఉన్న బుడితి రాజశేఖర్‌ను.. తిరిగివచ్చిన తర్వాత జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.