''సీఎం యాప్''...ఇందుకోసమే ప్రత్యేకంగా జేసీలు: అధికారులకు జగన్ ఆదేశం

By Arun Kumar PFirst Published May 5, 2020, 8:34 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

అమరావతి: మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌ రూపకల్పన, పనితీరు గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ యాప్‌ పనితీరును గురించి అధికారులు సీఎంకు వివరించారు. గతంలో చేసిన సూచనల మేరకు యాప్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు   ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఈ యాప్ కు కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (CM app)గా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 

జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలను ఒక జేసీకి అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిరోజూ వ్యవసాయ రంగం పరిస్థితులపై సమీక్ష చేయాలన్నారు. 
జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు చూస్తున్న జేసీలు అందరికీ ఈ యాప్‌పైన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. 

పంటల సేకరణ విధానాల్లో ఏవైనా లోపాలుంటే క్షుణ్ణంగా  అధ్యయనం చేసి పుల్‌స్టాప్‌ పెట్టాలన్నారు సీఎం. గ్రామస్థాయిలో పంటల సేకరణకు సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. 

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు జగన్ కు తెలియజేశారు. అందుకు తగినట్లుగా అన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. 

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఈ సమీక్షా సమావేశంలో ఏపీ అగ్రికల్చరల్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!