
అమరావతి : అంతర్జాతీయ క్రీడా వేదికపై అదరగొట్టిన తెలుగు క్రీడాకారణి జ్యోతి యర్రాజుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. అద్భుత ప్రదర్శనతో ఆసియా అథ్లెటిక్స్ ఛాపింయన్ షిప్ 2023 లో బంగారు పతకం సాధించి వైజాగ్ అమ్మాయి జ్యోతి యావత్ భారతదేశమే గర్వపడేలా చేసిందన్నారు. ఏపీ ప్రజలందరి తరపున జ్యోతి యర్రాజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ సీఎం జగన్ ట్వీట్ చేసారు.
థాయ్ లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2023 లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబర్చారు. వైజాగ్ కు చెందిన భారత క్రీడాకారిణి జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో బంగారు పతకం సాధించింది. ఇక పురుషుల 1500 మీట్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ కూడ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. పురుషుల ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ స్వర్ణం సాధించాడు. ఇలా రెండురోజుల్లో భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి.
ఇక వెయ్యి మీటర్ల రేసులో అభిషేక్ పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య కైలాష్ మిశ్రా కాంస్యాన్ని సాధించింది. పురుషుల డెకథ్లాన్ లో తేజస్విన్ శంకర్ కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు భారత్ ఆరు పతకాలు సాధించింది.
జూలై 12న థాయ్ లాండ్ లో మొదలైన ఆసియా అథ్లెటిక్స్ ఛాపింయన్ షిప్ 2023 16వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే 3 స్వర్ణాలు, 3 కాంస్య పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా మరికొన్ని విభాగాల్లో ఇంకొందరు క్రీడాకారులు పోటీ పడనున్నారు. కాబట్టి భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలున్నాయి.