హోదాపై 14వ ఆర్థికసంఘం అడ్డు చెప్పలేదు, లేఖ బయటపెట్టిన సీఎం జగన్: మోదీకి అందజేత

By Nagaraju penumalaFirst Published Jun 15, 2019, 6:10 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని చెప్పుకొచ్చారు. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,414  అయితే ఏపీలో రూ.8,397 మాత్రమేనని సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా ఇస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు వస్తాయన్నారు. 
 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నితి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత, రెవెన్యూ లోటు భర్తీ అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక సమర్పించారు. 

గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి లక్ష 18 వేల కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు ఉంటే ఏపీ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు అని నివేదికలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, 2015-16లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.14,414గా నమోదైతే, ఏపీలో అది రూ.8,397 మాత్రమేనని జగన్ వివరించారు. 

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న ఆయన 2018-19 నాటికి అవికాస్తా రూ.2 లక్షల 58 వేల కోట్లకు చేరాయని తెలిపారు. ఏడాదికి రూ. 20 వేల కోట్ల వడ్డీ, రూ.20 వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అనేదే లేదన్న ఆయన చేతివృత్తులు, ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళుతోందని వివరించారు. గత ప్రభుత్వ అవినీతి, నిబద్ధత లేమి వల్ల నిరుద్యోగం ఎక్కువైందన్నారు. 

ఇకపోతే ఏపీకి పెట్టుబడలు రాకపోవడంతో కొద్దికాలంలోనే ఖజానా ఖాళీ అయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనరేఖ అని జగన్ నొక్కిచెప్పారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ఇకనైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు సమకూరతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని జగన్ ఉద్ఘాటించారు. 

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదనే వదంతులు వినిపిస్తున్నాయని, 14వ ఆర్థికసంఘం సూచనలతో ప్రత్యేకహోదా ఇవ్వడంలేదంటూ బయట ప్రచారం జరుగుతోందని జగన్ తెలిపారు. ఏపీకి హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగతాయని బయట చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. 

రాష్ట్రాలకు హోదా రద్దుకు తాము సిఫారసు చేయలేదని 14వ ఆర్థికసంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖ గురించి సీఎం జగన్ సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నివేదికలో పొందుపరిచి ప్రధాని మోదీకి అందజేశారు. 

హోదా ప్రక్రియను వేగవంతం చేయాలని 2014 మార్చిలో అప్పటి కేంద్ర క్యాబినెట్ కోరిందని జగన్ తెలిపారు. ఈ అంశంలో ప్రణాళిక సంఘానికి అప్పటి క్యాబినెట్ ఆదేశాలు కూడా జారీచేసిందని, ప్రణాళిక సంఘం రద్దయ్యేవరకు దీనిపై గత రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టలేదని ఆరోపించారు. 

ఏపీ విషయంలో ప్రత్యేక హోదా షరతు ఆధారంగానే రాష్ట్ర విభజన జరిగిందని జగన్ గుర్తు చేశారు. రాజధాని లేకుండానే నవ్యాంధ్ర ఏర్పడిందని, అన్ని హంగులతో అత్యధిక రాబడి ఇచ్చే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయిందని అన్నారు. 

ఆర్థికంగా బలమైన రాజధానితో కొత్త రాష్ట్రం ఏర్పడడం ఇదే ప్రథమం అని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా షరతును నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014 బీజేప ప్రణాళికలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని సీఎం జగన్ నివేదికలో స్పష్టం చేశారు.

click me!