చంద్రబాబును అర్దరాత్రి ఇబ్బంది పెట్టలేదు.. హెలికాప్టర్ ప్రయాణానికి ఆయనే ఒప్పుకోలేదు.. ఏపీ సీఐడీ

Google News Follow Us

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో ఆయనను ఎలాంటి  ఇబ్బంది పెట్టలేదని అన్నారు. రాత్రికి 2.30 గంటలకు అక్కడికి చేరుకున్నప్పటికీ.. ఉదయం ఆరు గంటల వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. చంద్రబాబును ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్‌లో విజయవాడకు తీసుకొస్తామని చెబితే.. ఆయనే వద్దని అన్నారని తెలిపారు. 

అందుకే రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకోస్తామని చెప్పారు. మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టుగా తెలిపారు. చంద్రబాబు హోదా, వయసు రీత్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈరోజు సాయంత్రం వరకల్లా విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలిపారు. 

ఇక, ఆరోపించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్‌ నుంచి సీఐడీ బృందం అరెస్ట్ చేయడం జరిగిందని  అన్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. 

నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఆరోపించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసునని అన్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలను మాయం చేశారని చెప్పారు. ఈ స్కామ్‌లో బెనిఫిషియరీ కూడా చంద్రబాబేనని అన్నారు. ఈ కేసు దర్యాప్తులో చంద్రబాబు నాయుడే ప్రధాన నిందుతుడని తేలిందని చెప్పారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందేననని చెప్పారు. ఈడీ, జీఎస్టీలు కూడా ఇప్పటికే ఈ కేసును విచారించాయని చెప్పారు. 

ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందని స్పష్టమైందని అన్నారు. డిజైన్టెక్ కంపెనీ ఇందులో కీలకంగా  వ్యవహరించిందని  చెప్పారు. ఇది లోతైన ఆర్థిక నేరం అని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబుు అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ స్కామ్‌లో ముఖ్య భూమిక పోషించినవారు విదేశాలకు పారిపోయారని.. వారిని అదుపులోకి తీసుకునేలా ఇతర ఏజెన్సీల సహాయం తీసుకుంటామని చెప్పారు. ఈ స్కామ్‌లో లోకేష్ పాత్రపైనా కూడా విచారణ జరుపుతామని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా లోకేష్ పాత్రపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు.