
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 2014, 2015లో అమరావతి ప్రాంతంలో జరిగిన అసైన్డ్ భూముల అక్రమ, బినామీ కొనుగోళ్లకు సంబంధించిన నిధుల ప్రవాహానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ఏపీ సీఐడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కూడ నారాయణ, ఆయన కుమార్తె సంబంధించిన నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా, రాజధాని ప్రాంతంలోని గ్రామాల నుంచి ఎస్సీ, ఎస్టీలు, బీసీల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై పలు కేసులు నమోదయ్యాయి.
ఏపీసీఆర్‌డీఏ వైస్ చైర్మన్ హోదాలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో మాజీ మంత్రి నారాయణ హస్తం ఉన్నట్లు ఏపీ సీఐడీ చెబుతోంది. రాజధాని ప్రాంతంలో వివిధ రూపాల్లో అక్కడ నారాయణ భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించినట్టుగా పేర్కొంది. తనకు బినామీలుగా ఉన్న ప్రమీల, శంకర్, సాంబశివరావు పేర్లతో భూములు కొనుగోలు చేసే ముందు వారి ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసి పెద్దమొత్తంలో డిపాజిట్లు చేసినట్టుగా గుర్తించినట్టుగా చెబుతోంది. తనతో పాటు పలు సంస్థలకు లబ్ది చేకూర్చేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను నారాయణ మార్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
ఇందుకు సంబంధించి తాజా సోదాల సందర్భంగా.. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు స్టేట్‌మెంట్లను సేకరించి లావాదేవీలపై ఆరా తీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఓపెన్ ప్లాట్ల కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీలపై సీఐడీ బృందాలు దృష్టి సారించాయి.