
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం (ap government) అధికారంలోకి వచ్చాక దళితులకు జరుగుతున్న అన్యాయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా నోరువిప్పాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ (ks jawahar) సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ (ap assembly budget session 2022) సమావేశాల్లో దళితుల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలని... ప్రభుత్వం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ మేరకు వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జవహర్ బహిరంగ లేఖ రాసారు.
''జగన్ రెడ్డి పాలనలో దళితులు అడుగడుగునా అన్యాయానికి,అవమానానికి గురవుతున్నారు. మీ ప్రభుత్వ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం, మోసంపై ప్రస్తుతం జరుగుతున్న చట్టసభల్లో నోరు విప్పాలి'' అని బహిరంగ లేఖ ద్వారా కోరారు.
''టీడీపీ హయాంలో దళితులకు అమలు చేసిన సంక్షేమ పథకాలను వైసిపి అధికారంలోకి రాగానే నిలిపివేశారు. అంతేకాదు ఇళ్లస్థలాల పేరుతో వేలాది ఎకరాల దళితుల భూములు లాక్కున్నారు. సబ్ ప్లాన్ నిధులు కూడా దారి మళ్లించారు'' అని ఆరోపించారు.
''ఇక వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరగని ప్రదేశం లేదు. వారి ఆర్తనాదాలు వినిపించని రోజు లేదు. ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ సుధాకర్ తో పాటు ఓంప్రతాప్, చీరాల కిరణ్ వంటి ఎందరో దళితుల ప్రాణాల్ని వైసీపీ ప్రభుత్వం బలితీసుకుంది. దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. వీటన్నింటిపై దళిత ప్రజాప్రతినిధులు నోరు విప్పాలి. దళితులకు జగన్ రెడ్డి చేస్తున్నఅన్యాయంపై చట్టసభల సాక్షిగా నిలదీయాలని దళిత జాతి కోరుకుంటోంది'' అని మాజీ మంత్రి జహహర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే జగన్ రెడ్డి పాలనలో మైనారిటీలకు కూడా అన్యాయం జరుగుతోందని టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిం సమాజానికి చీకట్లే మిగిలాయని అన్నారు.
''గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఉర్దూభాషను రాష్ట్ర రెండో అధికారభాషగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఇది తమ ప్రభుత్వ ఘనకార్యమేనంటూ మైనారిటీ ఓటుబ్యాంకు కోసం జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టుకుంటున్నాడు. ముఖ్యమంత్రికి నిజంగా ముస్లింలపై, ఉర్దూపై ప్రేమాభిమానాలే ఉంటే టీడీపీ ప్రభుత్వం మైనారిటీలకు అమలుచేసిన పథకాలు ఎందుకు ఆపేశాడు? ఉర్దూ అకాడమీకి నిధులు ఇవ్వకుండా... బోధనా సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నాడు?'' అని ఫతావుల్లా నిలదీసారు.
''టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ఉర్దూ కళాశాలలు నిర్మిస్తే... ఇప్పుడు వాటిని పరిపాలనా భవనాలుగా మార్చాలని ముఖ్యమంత్రి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ప్రాథమిక పాఠశాలల్లో ఉర్దూబోధన కోసం చంద్రబాబు నియమించిన ఉపాధ్యాయులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొలగించాడు?'' అని ప్రశ్నించారు.
''ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం. ఆ భయమే ఆయన నోటినుంచి చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లింలకు చేసిన మంచిని బయటకు రానీయడంలేదు. ముస్లింలకు తమ మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి ఏం చేశాడనేదానిపై, ఉర్దూ భాషకు ఎవరి హాయాంలో ఎలాంటి లబ్ధి కలిగిందనే దానిపై ఉపముఖ్యమంత్రితో బహిరంగచర్చకు సిద్ధం'' అని ఫతావుల్లా సవాల్ విసిరారు.
''ముఖ్యమంత్రి జగన్ నిజంగా ఉర్దూని ఉద్ధరించేవాడే అయితే, తెలుగు భాషతో సమానంగా దాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే తమ జీవితాల్లో సుఖసంతోషాలు ఉంటాయని 70శాతం ముస్లిం సమాజం భావిస్తోంది'' అని ఫతావుల్లా పేర్కొన్నారు.