మీరేం చేశారు: పవన్ తో నారాయణ పొత్తు వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఫైర్

By Siva KodatiFirst Published Oct 1, 2020, 5:08 PM IST
Highlights

బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వాణీ, మురళీ మనోహర్ జోషి కుట్రచేశారనడం సరికాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇందుకు సంబంధించి సిపిఐ నారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఆయన అన్నారు

బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వాణీ, మురళీ మనోహర్ జోషి కుట్రచేశారనడం సరికాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇందుకు సంబంధించి సిపిఐ నారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఆయన అన్నారు.  

ఉమాభారతి ముందుండి నడిపించారని నారాయణ  మాట్లాడటం సమంజసం కాదని వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశంలో మొదటి నుంచీ హిందువులకు వ్యతిరేకంగా, ఇతర మతాలపై బుజ్జగింపు రాజకీయాలు చేసే కమ్యూనిస్టులకు ఈ తీర్పు రుచించదన్నారు.

అందుకే పేపర్లలో నారాయణ రంకెలేస్తూ, నృత్యాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారని సోము వీర్రాజు ఫైరయ్యారు. అద్వానీ, జోషి, ఇతర నాయకులు ఆ వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేయమని ఆదేశించడం మీరు చూశారా ఆయన ప్రశ్నించారు.

ఈ కేసులో న్యాయస్థానం నిస్పక్షపాతంగా తీర్పు ఇచ్చిందని వీర్రాజు గుర్తుచేశారు. బీజేపీ సీనియర్ నాయకులపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పుడు అభియోగాలు శుద్ధ అబద్దాలుగా ఈ తీర్పు ద్వారా వెల్లడైందని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించే హక్కు మీకు లేదని సోము వీర్రాజు మండిపడ్డారు.  కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోని పార్టీ దేశంలో ఏదైనా ఉందా అని ఆయన నిలదీశారు.  

కాంగ్రెస్, ఎన్టీఆర్, చంద్రబాబులతో మీరు పొత్తు పెట్టుకోలేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మీకు జ్ఞాపకశక్తి లేదా లేక చరిత్రపై అవగాహన లేదా అంటై సెటైర్లు వేశారు. బీజేపీ పూర్వపార్టీ జనసంఘ్ పంజాబ్‌లో పొత్తు పెట్టుకున్న విషయాన్ని నారాయణ మరచిపోయారంటూ ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను ప్రశ్నించే ముందు మీరు గతంలో ఆయనతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలియలేదా? అని వీర్రాజు చురకలంటించారు.  2014లో పవన్ కల్యాణ్ బీజేపీ, తెలుగుదేశంతో కలసి పొత్తు పెట్టుకుని విజయం సాధించామని సోము గుర్తుచేశారు.

మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు కేసుపై మీ వ్యతిరేకతను, పవన్ కల్యాణ్ బీజేపీ పొత్తులపై చేసిన వ్యాఖ్యలను నారాయణ ఉపసంహరించుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు. 

click me!