నేను ఈ వ్యవస్థ నుంచి తప్పుకుని వెళ్లిపోతా: స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Aug 29, 2019, 8:48 AM IST
Highlights

కోడెల వ్యవహారంలో విచారం మాత్రం వ్యక్తపర్చగలను తప్ప ఇంక ఎక్కువ మాట్లాడదలచుకోలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కక్ష సాధింపు అంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. కక్ష సాధింపు అని ఏపీలో ఒక్క పౌరుడితో అయినా అనిపిస్తే తాను ఈ వ్యవస్థ నుంచి తప్పుకుని వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

న్యూఢిల్లీ: దేశరాజధాని హస్తినలో జరిగిన స్పీకర్ల సమావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయంటూ ఆరోపించారు. 

చట్టసభలో స్పీకర్ స్థానం అనేది ఎంతో పవిత్రమైనదని ఆయన కొనియాడారు. అయితే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంత ఇంటికి తరలించడం దురదృష్టకరమన్నారు. అది స్పీకర్ వ్యవస్థకు మచ్చగా మిగిలిపోతుందన్నారు. 

కోడెల వ్యవహారంలో విచారం మాత్రం వ్యక్తపర్చగలను తప్ప ఇంక ఎక్కువ మాట్లాడదలచుకోలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కక్ష సాధింపు అంటూ వస్తున్న వార్తలు సరికాదన్నారు. కక్ష సాధింపు అని ఏపీలో ఒక్క పౌరుడితో అయినా అనిపిస్తే తాను ఈ వ్యవస్థ నుంచి తప్పుకుని వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

స్పీకర్‌ వ్యవస్థలు సంక్ష్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, వ్యవస్థ పనితీరును మెరుగుపర్చే అంశంపై స్పీకర్ల సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కర్ణాటక, ఏపీల్లో పార్టీ ఫిరాయింపుల గురించి తాను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.  

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించడం అనైతిక చర్య అంటూ విమర్శించారు. అధికార పార్టీలోకి జంప్ అవుతున్న సమయంలో పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని సూచించారు. కొన్ని నైతిక విలువలు పాటించాలని సూచించారు. ఆ ఫిరాయింపులకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ఫిరాయింపులు పెరిగిపోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల అస్థిరత వల్ల స్పీకర్‌ వ్యవస్థలపై ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నైతికత అంశాన్ని మనం పక్కనబెట్టామని చెప్పుకొచ్చారు. 

2014-2019 కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార తెలుగుదేశం పార్టీ చేర్చుకుందని, అందులో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఇది సబబా అంటూ నిలదీశారు.  

ప్రజావ్యవస్థ అన్ని వ్యవస్థల కన్నా బలమైనదని తప్పుచేస్తే ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సభ్యుల ప్రవర్తన నియమావళిపై కమిటీని నియమిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారని చెప్పుకొచ్చారు.  

click me!