ఈ నెల 19 నుంచి బడ్జెట్ సమావేశాలు... ఏపి సర్కార్ ప్రకటన

By Arun Kumar PFirst Published Mar 10, 2021, 9:17 AM IST
Highlights

ఈ నెల(మార్చి) 19 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ నెలలోనే సమావేశాలను నిర్వహించి రాష్ట్ర బడ్జెట్2021‌-2022ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. 

మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి.                

ఇప్పటికే ఈ సమావేశాల్లో జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.  అలాగే పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రెడీ చేస్తోంది.

ఇకమరో తెలుగురాష్ట్రం తెలంగాణలోనూ ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. మార్చి 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. అదే రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 16వ తేదీన దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ఉంటుంది.

ఈనెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఇక 18వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 

click me!