ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ముగ్గురు టీడీపీ నేతలకు నోటీసులు

By Nagaraju penumalaFirst Published Nov 26, 2019, 1:26 PM IST
Highlights


అసెంబ్లీలో శాసన సభ ఉపనేత అచ్చెన్నాయుడు, శాసన మండలిలో మాజీమంత్రి నారా లోకేష్ ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా టీడీపీ నేతలకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చేలా వ్యవహారం అంతా నడిపినట్లు ప్రచారం జరుగుతుంది.
 

అమరావతి: డిసెంబర్ 9 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీని కట్టడి చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. 

అసెంబ్లీలో శాసన సభ ఉపనేత అచ్చెన్నాయుడు, శాసన మండలిలో మాజీమంత్రి నారా లోకేష్ ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా టీడీపీ నేతలకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చేలా వ్యవహారం అంతా నడిపినట్లు ప్రచారం జరుగుతుంది.

స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచితంగా వ్యవహరించారనే అభియోగంతో టీడీపీ నేతలపైన ఇప్పటికే వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 
టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. 

డిసెంబర్ 9 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే కూన రవికి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. గుడ్డలూడదీస్తా అంటూ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. వారంలోగా వివరణ ఇవ్వాలని సూచించారు. 

ఇకపోతే స్పీకర్ ను అవమానించేలా టీడీపీ శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ లోకేష్ లపై కూడా ప్రివిలేజ్ నోటీసులు  జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ సూచించారు. 

మరోవైపు ముగ్గురు టీడీపీ నేతలపైనా స్పీకర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అచ్చెన్నాయుడు, కూనరవికుమార్ లపై ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 
 

click me!