
అమరావతి: రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్దమయ్యింది. రాష్ట్రానికి సంబంధించిన 2022-23 బడ్జెట్ (AP 2022-23 Budget) రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన జగన్ సర్కార్ ఈ నెలలో(ఫిబ్రవరి) లేదా వచ్చే నెల(మార్చి)లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను రెండు వారాల పాటు నిర్వహించాలని వైసిపి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అనువైన తేదీని సూచించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం కోరగా ఫిబ్రవరి 16, 24 లేదా మార్చి 4, 7 తేదీలను సూచించారు. ఈ నాలుగింట్లో ఏ తేదీన అసెంబ్లీ సెషన్స్ ప్రారంభించాలో జగన్ సర్కార్ నిర్ణయించనుంది. ఏ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నది ఇవాళ సాయంత్రానికి క్లారిటీ రానుంది.
ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలన నిర్ణయాలకు సంబంధించిన బిల్లులను కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు (new district in ap)కు సంబంధించిన ప్రత్యేక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లును కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభణతో ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేకపోయింది. అయితే ఈసారి పరిస్థితి కాస్త మెరుగ్గానే వున్న నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు జగన్ సర్కార్ సిద్దమయ్యింది.
ఇలా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై కసరత్తు సాగిస్తుండగా ప్రతిపక్షాలు కూడా అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో తన కుటుంబాన్ని మరీ ముఖ్యంగా భార్య భువనేశ్వరిని అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. తనను అవమానించిన అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని ఆయన శపథం చేసారు. కాబట్టి బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు లేవు.
అయితే మిగతా టిడిపి ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ఆర్థిక బాగోలేదని ఉద్యోగులతో మంత్రులు చేసిన కామెంట్స్ పై చర్చకు టిడిపి సిద్దమయ్యింది. ఇక కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, విద్యుత్ కొరతపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్దమయ్యింది.
ఇదిలావుంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2,29,779 కోట్లతో బడ్జెట్ ను ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం రూ 1,82,196 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 47,582 కోట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ లోటును రూ. 5 వేల కోట్లుగా తేల్చి చెప్పింది.జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు రూ.3.49 శాతంగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.
ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 2021-22 వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రతిపాదించారు. అలాగే తొలిసారిగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించింది.రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ తీసుకొచ్చింది.