Siva Kodati |  
Published : Mar 07, 2022, 10:43 AM ISTUpdated : Mar 07, 2022, 02:11 PM IST

AP Assembly Budget session 2022 Highlights : గవర్నర్ ప్రసంగం హైలైట్స్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. తర్వాత సభ వాయిదాపడనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. రెండో రోజు దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డికి ఉభ‌య స‌భ‌లు సంతాపం తెలుపుతాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది.

AP Assembly Budget session 2022 Highlights : గవర్నర్ ప్రసంగం హైలైట్స్

12:25 PM (IST) Mar 07

దేశంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్టు అప్‌స్కి‍ల్లింగ్‌ ప్రోగ్రామ్

వైఎస్సార్‌ జగన్‌ బడుగు వికాసం కింద షెడ్యూల్‌ కులాల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని.. దేశంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్టు అప్‌స్కి‍ల్లింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గవర్నర్ వెల్లడించారు. 2.98 లక్షలకు గాను 2.87 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు

12:25 PM (IST) Mar 07

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగవంతం

భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు రూ. 2363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించామని గవర్నర్ అన్నారు. 

12:21 PM (IST) Mar 07

గ్రామీణ ప్రాంత రోడ్డ అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయం

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయం చేసినట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఈ క్రమంలో 3 వేల కిలో మీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

12:20 PM (IST) Mar 07

వైఎస్సార్ చేయూత కింద రూ.9,100 కోట్ల సాయం

వైఎస్సార్‌ చేయూత ద్వారా రాష్ట్రంలోని 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కాపు నేస్తం కింద ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. 

12:11 PM (IST) Mar 07

మూడు ఓడరేవుల అభివృద్ధి

వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  

12:11 PM (IST) Mar 07

2023 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి

పోలవరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి జీవనాడి అన్నారు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌. 2023 జూన్‌ నాటికి పోలవరం పూ​ర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయన్నారు.

12:02 PM (IST) Mar 07

రైతుభరోసా కింద రూ. 20,162 కోట్ల సాయం

రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని ఆయన పేర్కొన్నారు. 

12:00 PM (IST) Mar 07

నేతన్నలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు ఎంత సాయమంటే

వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు గవర్నర్ పేర్కొన్నారు.

11:59 AM (IST) Mar 07

18.55 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్

9 గంటల ఉచిత విద్యుత్‌ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. 

11:57 AM (IST) Mar 07

అన్ని వర్గాలకు సాయం

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేశామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. వైఎస్సార్‌ వాహన మిత్ర కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 770 కోట్లు... వైఎస్సార్‌ ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్లు.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు అందించామని గవర్నర్ పేర్కొన్నారు. 

11:54 AM (IST) Mar 07

రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు

జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ప్రతిపాదించామని .. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని గవర్నర్ గుర్తుచేశారు. 
 

11:53 AM (IST) Mar 07

2020-21లో 16.82 శాతం ఆర్ధిక వృద్ధి

ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2020-2021 ఏడాదికిగానూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని గవర్నర్ అన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. 
 

11:50 AM (IST) Mar 07

పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలు

గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కోవిడ్‌ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ ప్రశంసించారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని బిశ్వభూషణ్ తెలిపారు

11:41 AM (IST) Mar 07

బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై మంత్రి హరీష్ సీరియస్

తెలంగాణకు కేంద్రం తీరని ద్రోహం చేస్తోదంటూ మంత్రి హరీష్ మండిపడ్డారు. ఖమ్మంలోని ఏడుమండలాలను  ఏపీకి బదలాయించడంతో ప్రారంభించి ఇప్పటివరకు కేంద్రం తెలంగాణకు ఎలా అన్యాయం చేస్తుందో ఆర్థిక మంత్రి వివరించారు. 

 
 

11:39 AM (IST) Mar 07

లాబీల్లోనూ వుండనివ్వరా : నారా లోకేశ్ ఆగ్రహం

ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే వారు అసెంబ్లీ లాబీల్లో నిలబడకుండా మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. సభలో మాట్లాడనివ్వడం లేదని,  కనీసం లాబీల్లో కూడా వుండనివ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

11:35 AM (IST) Mar 07

మార్షల్స్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాగ్వాదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే వారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ వెళ్లే మార్గంలోకి వెళ్తుండగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్షల్స్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. 

11:32 AM (IST) Mar 07

టీడీపీ సభ్యులను అడ్డుకున్న మార్షల్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే వారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ వెళ్లే ఆ మార్గంలోకి వెళ్తుండగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు.

11:29 AM (IST) Mar 07

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు.. సభ జరుగుతుండగానే వాకౌట్ చేశారు. 

11:23 AM (IST) Mar 07

ఉగాది నుంచి కొత్త జిల్లాలు

రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని గవర్నర్ తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన వృద్ధిని సాధిస్తోందని ఆయన అన్నారు. పాలన కింది స్థాయి వరకు అందేలా.. గ్రామ, వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయని గవర్నర్ ప్రశంసించారు.

11:13 AM (IST) Mar 07

గవర్నర్ స్పీచ్ కాపీలను చించేసిన టీడీపీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. గవర్నర్ గో బ్యాక్ అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అంతేకాదు గవర్నర్ స్పీచ్ కాపీలను చించేశారు. 

 

"

11:11 AM (IST) Mar 07

టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ అసహనం

ఆంధప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ వారు సభలో నినాదాలు చేశారు. దీంతో తెలుగుదేశం సభ్యులపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.

 

"

11:09 AM (IST) Mar 07

తొలిరోజే హాట్ హాట్‌‌గా ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ వారు సభలో నినాదాలు చేశారు. టీడీపీ ఆందోళనతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. 

11:08 AM (IST) Mar 07

గవర్నర్‌ ‘‘గో బ్యాక్’’ అంటూ టీడీపీ నేతల నిరసన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ వారు సభలో నినాదాలు చేశారు.

11:06 AM (IST) Mar 07

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 

10:55 AM (IST) Mar 07

చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం

 

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ప్రజా సమస్యలను ఉభయసభల్లోనూ గట్టిగా ఎత్తి చూపాలని చంద్రబాబు సూచించారు. 

10:48 AM (IST) Mar 07

అసెంబ్లీకి చేరుకుంటున్న శాసనసభ్యులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.