స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా కర్నూలు జిల్లా సీనియర్ నేత కేఈ ప్రభాకర్ టీడీపీని వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
కర్నూలు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పలువురు నాయకులు టీడీపీని వీడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నారు.
తాజాగా, కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన చంద్రబాబు పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఆయన వైఎస్సార్ కాంగ్రెసులోకి వెళ్తారా, లేదా అనేది తేలడం లేదు. కానీ, వైసీపీ ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు మాత్రం ప్రచారం సాగుతోంది. ఆయన శుక్రవారం తన అనుచరులతో సమావేశమవుతున్నారు.
ఇప్పటికే, చంద్రబాబుకు విశాఖపట్నం, కడప, ప్రకాశం జిల్లాల్లో పెద్ద దెబ్బలు తగిలాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. విశాఖపట్నం జిల్లాలో మాజీ ఎమ్మల్యే పంచకర్ల రమేష్ తో పాటు పలువురు నేతలు వైసీపిలో చేరారు. కరణం బలరాం, కదిరి బాబూరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరారు.